ఎంతకు తెగించార్రా : మహాలక్ష్మి స్కీం.. ఫేక్ ఐడీ కార్డులు.. ఒక్కోటి 100 రూపాయలు

ఎంతకు తెగించార్రా : మహాలక్ష్మి స్కీం.. ఫేక్ ఐడీ కార్డులు.. ఒక్కోటి 100 రూపాయలు

నకిలీకి కాదేదీ అనర్హం.. ఐడియాకు కాదేదీ వ్యాపారం అన్నట్లు.. కేటుగాళ్లు రెడీ అయిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని తమ దోపిడీకి మార్గంగా ఎంచుకున్నారు కంత్రీగాళ్లు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి.. ప్రతి నెలా నగదు చెల్లింపునకు.. గ్యాస్ సిలిండర్ ఇలా.. మహిళలకు అందించే పథకాలకు సంబంధించి.. ప్రభుత్వం మహాలక్ష్మి అనే కార్డు జారీ చేయనుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు అప్పుడే.. నకిలీరాయుళ్లు రంగంలోకి దిగేశారు.

నకిలీ మహాలక్ష్మి కార్డులను ముద్రించి.. ఒక్కో కార్డును 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ కార్డు ఉంటేనే ఆర్టీసీ ఉచితంగా ప్రయాణిస్తారంటూ.. పల్లెల్లోని మహిళలకు చెబుతూ.. కార్డును అమ్ముతున్నారు. పింక్ కలర్ లో ఉన్న నకిలీ కార్డుపై కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు అని ఉంది.. అదే విధంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం,, ప్రతినెలా 2 వేల 500, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అని ముద్రించి ఉంది. ఈ కార్డుపై సోనియాగాంధీ పేరుతో సంతకం కూడా క్రియేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు, సోనియాగాంధీ ఫొటోలు ఉన్నాయి. 

కార్డుకు రెండో వైపు నియోజకవర్గం ఎమ్మెల్యే ఫొటో, పార్టీ గుర్తు ఉంది. ఆ పక్కనే క్యూ ఆర్ కోడ్ కూడా పెట్టారు. ఎవరెవరికి కార్డు కావాలా.. వారి పేరుతో ఈ కార్డులు ముద్రించి.. ఒక్కొక్కటి 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు కేటుగాళ్లు..

నిజం ఏంటీ అంటే : అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎవరికీ.. ఎలాంటి కార్డులు అధికారికంగా జారీ చేయలేదు.. విధివిధానాలు కూడా రూపొందించలేదు. దీనికి కొంత సమయం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న మహాలక్ష్మి కార్డులు అన్నీ నకిలీవి అని.. ఎవరూ నమ్మొద్దని.. వాటికి డబ్బులు చెల్లించవద్దని స్పష్టం చేస్తున్నారు అధికారులు. నకిలీ కార్డులు ముద్రించి.. అమ్మే వ్యక్తులపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు.