కాబోయే టీచర్లకు పాఠాలు చెప్పేటోళ్లే లేరు

కాబోయే టీచర్లకు పాఠాలు చెప్పేటోళ్లే లేరు

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20 ఏళ్లుగా నో రిక్రూట్​మెంట్

పాలమూరు బీఈడీ కాలేజీలో అన్ని ఖాళీలే..

ప్రిన్సిపల్​ కూడా ఇన్​చార్జీయే..

మహబూబ్​నగర్​, వెలుగు:  కాబోయే పంతుళ్లకు పాఠాలు నేర్పే కాలేజీ అది.. కానీ ఏం లాభం.. ఆ కాలేజీకి ఒక్క లెక్చరర్​ కూడా లేరు. ప్రిన్సిపల్​ కూడా ఇన్​చార్జీయే.. క్లర్కులు, డిప్యూటేషన్​పై వచ్చిన లెక్చరర్లతోనే కాలేజీ నడుస్తోంది. దాదాపు 20 ఏండ్ల నుంచి ఇదే సమస్య. డిప్యూటేషన్​పై కొంతమందిని తీసుకొచ్చి వారితో నెట్టుకొస్తున్నారు. జిల్లా యంత్రాంగం, నేతలు పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. సాక్షాత్తు మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఇలాఖాలో ప్రభుత్వ బీఈడీ కాలేజీ పరిస్థితి ఇది. ఎంతోమంది టీచర్లను తయారు చేసిన ఈ కాలేజీ ప్రస్తుతం లెక్చరర్లు లేక వెలవెలబోతోంది. పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నా సర్కార్​ స్పందించడం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కాలేజీగా 1969లో ప్రారంభమైన ఈ కాలేజీ 1995న బీఈడీ కాలేజీగా మారింది. ఆరుగురు లెక్చరర్లను డిప్యూటేషన్​పై తీసుకుని నడిపిస్తున్నామని ఇన్​చార్జి ప్రిన్సిపల్​ చెబుతున్నారు.

1998 నుంచి రిక్రూట్మెంట్ బంద్..

మహబూబ్​నగర్​ ప్రభుత్వ శిక్షణ కాలేజీ 1969 అక్టోబర్​ 2లో ఏర్పాటైంది. ఉస్మానియా యూనివర్సిటీకి శాశ్వత అనుబంధ కాలేజీల్లో ఇదొకటి. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్​ హైస్కూళ్లలో ట్రైనింగ్​ పొందని టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1995 జులై 24లో బీఈడీ కాలేజీగా మారింది. విచిత్రమేమిటంటే అన్ని జిల్లా శాఖల ఆఫీసర్లు ఉండే పాలమూరు జిల్లా కేంద్రంలోని బీఈడీ కాలేజీలో గత విద్యా సంవత్సరం నుంచి ఒక్క లెక్చరర్​ కూడా లేరు. వివిధ విభాగాలకు 15 మంది లెక్చరర్లు అవసరం ఉండగా..  ఒక్కరూ లేకపోవడం గమనార్హం. స్టూడెంట్స్​కు పాఠాలు ఎవరు బోధిస్తారనే విషయంపై ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. ప్రిన్సిపల్​ పోస్టుకు కూడా నాగర్​కర్నూల్​ డీఈవో ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు. 1998 నుంచి రిక్రూట్​మెంట్లు లేకపోవడంతో లెక్చరర్ల పోస్టులు భర్తీ కావడం లేదు.

స్టూడెంట్స్ భవిష్యత్ ప్రశ్నార్థకం..

కాలేజీలో ఎడ్​సెట్​ ద్వారా ఏటా వంద మంది స్టూడెంట్స్​ అలాట్​ అవుతారు. రెండేళ్ల కోర్సు చేసి పట్టా పొందుతారు. ఆ తర్వాత టీచర్​ రిక్రూట్​మెంట్​ టెస్ట్​కు ఎలిజిబుల్​ అవుతారు. కానీ ఈ కాలేజీలో ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్​ ఇక్కడ జాయిన్​ అయ్యాక తమ స్వశక్తిని నమ్ముకుని పరీక్షలు రాయాల్సి వస్తోంది. లెస్సన్స్​ చెప్పేవారు లేక ఇందులో చదువుతున్న స్టూడెంట్స్​ భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇన్​చార్జి ప్రిన్సిపల్​గా నాగర్​కర్నూల్​ డీఈవోకు ఇచ్చారు. ప్రస్తుతం బీఈడీ కాలేజీలో అలాట్​ అయిన వాటిలో  2 తెలుగు పోస్టులు, 2 హిందీ, 2 బయో సైన్స్​, 2 సోషల్​ స్టడీస్​, ఉర్దూ, ఫిజికల్​సైన్స్​, మ్యాథ్స్, ఫిలాసపీ, స్కూల్​ అడ్మిన్​, మనో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఒక్కో లెక్చరర్​ పోస్టు ఖాళీ ఉంది. ఫిజికల్​ ఎడ్యుకేషన్​ హిందీ, లైబ్రేరియన్​, ఫిలిం ఆపరేటర్​, డ్రాయింగ్​మాస్టర్​, మాన్యువల్​ ఇన్​స్ట్రక్టర్​ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి.

ఆరుగురితో ఆన్​లైన్​లో క్లాసులు..

ఈ ఏడాది కోవిడ్​ ప్రభావంతో ఆన్​లైన్​ క్లాసులు నడిపించాల్సి ఉండగా ఆరుగురు లెక్చరర్లతో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈసారి ఎడ్​సెట్​ రాసిన స్టూడెంట్స్​ 100 మంది అడ్మిషన్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. లెక్చరర్ల కొరత కారణంగా ఇప్పుడు కాలేజీలో చేరబోయే స్టూడెంట్స్​ ఆందోళన చెందుతున్నారు. లెక్చరర్​ పోస్టులను భర్తీ చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. బోధననేతర సిబ్బందిలోనూ ఖాళీలు ఉన్నాయి.

మంత్రి చొరవ చూపాలి

మహబూబ్​నగర్​ బీఈడీ కాలేజీలో కొన్నేళ్లుగా లెక్చరర్లు లేరు. ఎడ్​సెట్​లో మంచి ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్​ ఈ కాలేజీకి అలాట్​ అయ్యాక చాలా నర్వస్​ అవుతున్నారు. స్టూడెంట్స్​ సొంతంగా చదివి పాసవుతున్నారు. కాలేజీలో లెక్చరర్ల కొరత తీర్చే విషయంలో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ చొరవ చూపాలి. -శ్రీధర్​, బీఈడీ స్టూడెంట్​, మహబూబ్​నగర్.

ఆరుగురితో నెట్టుకొస్తున్నాం

బీఈడీ కాలేజీలో లెక్చరర్ల కొరత ఉన్నది వాస్తవమే. 15 మంది రెగ్యులర్​ పోస్టులకు ఒక్కరు కూడా లేరు. ఉన్నతాధికారులకు విన్నవించి ఆరుగురు లెక్చరర్లను డిప్యూటేషన్​పై తీసుకుని ఆన్​లైన్​ క్లాసులు నడిపిస్తున్నాం. స్టూడెంట్స్​కు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.– గోవిందరాజులు, ఇన్​చార్జి ప్రిన్సిపల్