వ్యాపారి కిడ్నాప్కు విఫలయత్నం.. అప్పు ఇచ్చిన వ్యక్తిని టార్గెట్ చేసిన నిందితులు.. కామారెడ్డి జిల్లాలో ఆరుగురు అరెస్ట్

వ్యాపారి కిడ్నాప్కు  విఫలయత్నం.. అప్పు ఇచ్చిన వ్యక్తిని టార్గెట్ చేసిన నిందితులు..  కామారెడ్డి జిల్లాలో ఆరుగురు అరెస్ట్

కామారెడ్డి, వెలుగు: అప్పు ఇచ్చిన వ్యాపారినే కిడ్నాప్​ చేసేందుకు యత్నించిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద ఎయిర్​ గన్స్​ స్వాధీనం  చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర వెల్లడించారు. కామారెడ్డికి చెందిన వ్యాపారి భూస శ్రీనివాస్‌‌‌‌కు చిట్యాలకు చెందిన నిట్టు నర్సింగ్‌‌‌‌రావు, సురం స్వామి, సంతాయిపేటకు చెందిన వడ్డె స్వామి, పులి ప్రశాంత్‌‌‌‌గౌడ్ భారీ మొత్తంలో అప్పు చెల్లించాల్సి ఉంది. 

ఈ అప్పును తప్పించుకోవడమే కాకుండా అతడి వద్ద మరిన్ని డబ్బులు లాగేందుకు వారు ప్రణాళిక రచించారు. ఆయనను కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యులను బెదిరించి డబ్బులు దోచుకోవాలని కుట్ర పన్నారు. ఈ క్రమంలో తుపాకీ కొనేందుకు మహారాష్ట్రకు చెందిన అజయ్, వైభవ్‌‌‌‌ ను సంప్రదించారు. మే 12న నర్సింగ్‌‌‌‌రావు, వడ్డె స్వామి మహారాష్ట్రలోని నయగావ్‌‌‌‌కు వెళ్లి మారుతి గోకేను కలిసి రూ.30 వేలకు తుపాకీ కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. రూ.27 వేలు అడ్వాన్స్ చెల్లించారు. 

మే 27న తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి శివాలయం వద్ద తుపాకీ తీసుకునేందుకు వచ్చారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటబడి అదుపులోకి తీసుకున్నారు. 

ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌‌‌‌రావు ఆధ్వర్యంలో సీఐ సంతోష్‌‌‌‌కుమార్, ఎస్సై నరేశ్​ విచారణ చేపట్టారు. పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్​ చేసి ఫైర్ ఆర్మ్ తుపాకీ, రబ్బర్ బుల్లెట్లు, ఎయిర్ రైఫిల్ బాక్సులు, సెల్‌‌‌‌ఫోన్లు, నైలాన్ తాడు, రూ.3 వేలు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు మారుతి గోకే పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.