
- అందుబాటులోకి తెచ్చిన ఫైమా
- రోజూ 20 గంటలూ సేవలు
హైదరాబాద్, వెలుగు: పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల వల్ల మానసికంగా ఇబ్బందిపడే డాక్టర్ల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ అందుబాటులోకి వచ్చింది. ‘మెంటల్ హెల్త్ మ్యాటర్స్’ నినాదంతో ‘మెంటల్ హెల్త్ రిడ్రెస్సల్ హెల్ప్‌లైన్ (ఎంఎంహెచ్‌ఆర్)’ను ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) ఇటీవల ప్రారంభించింది. ఈ హెల్ప్‌లైన్ రోజూ ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు 20 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా నిపుణులైన సైకియాట్రిస్ట్‌ల బృందం ఈ హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తున్నది.
తెలుగు, ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, తమిళం, కన్నడ, మరాఠీ భాషల్లో సేవలు ఉంటాయి. వివిధ సమయాల్లో సైకియాట్రిస్టులు అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉండే.. మెంటల్ హెల్త్ చెకప్‌కు సంబంధించిన డాక్టర్ల ఫోన్ నంబర్ల జాబితాను ఫైమా విడుదల చేసింది. ఫైమా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అక్షయ్ డోంగర్డివే, నేషనల్ చైర్మన్ డాక్టర్ మనీష్ జాంగ్రా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. కార్యక్రమం ద్వారా దేశంలోని మెడికల్ ప్రొఫెషనల్స్ మెంటల్ హెల్త్ మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.