
Fair Grow Trading Scam: ఇటీవలి కాలంలో క్రిప్టోలు బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది చిన్నపెట్టుబడిదారులు కూడా క్రిప్టోల్లో వస్తున్న లాభాలు చూసి తమ వద్ద ఉన్న మెుత్తంతో పాటు అప్పులు తెచ్చి మరీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీనినే కొందరు మోసగాళ్లు ఆసరాగా చేసుకుంటూ కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. తమ వద్ద డబ్బు పెట్టుబడిపై అధిక వడ్డీ అంటూ కూడా క్రిప్టో పేరుతో ఒక సంస్థ విశాఖలో చేసిన వ్యవహారం ఆలస్యంగా బయటపడింది.
వివరాల్లోకి వెళితే విశాఖ నగరంలోని ఎంవీపీ కాలంలో ఏర్పాటు చేయబడిన ఫెయిర్ గ్రో ట్రేడింగ్ అనే సంస్థ అధిక రాబడులను ఆశ చూపి చాలా మంది నుంచి భారీగా డబ్బు వసూలు చేసింది. ఒకసారి కంపెనీ వెబ్ సైట్ పరిశీలిస్తే ఇది క్రిప్టో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ.. ట్రేడర్లకు అవసరమైన పరిష్కారాలను అందించే వ్యాపారంలో ఉన్న కంపెనీగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ కంపెనీ పెద్ద మెుత్తంలో ప్రజల నుంచి సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేసి టోకరా పెట్టేసినట్లు రోహిత అనే బాధితురాలు చేసిన ఫిర్యాదుతో బయటపడింది.
తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక రాబడిగా వడ్డీ చెల్లిస్తామంటూ నమ్మించాడు నిర్వాహకులు వెంకట్ కిషోర్, నందన్, రామనాంబ. దీంతో రోహిత అనే బాధితురాలు వారితో చాలా ఏళ్లుగా ఉన్న పరిచయంతో నమ్మకంగా రూ.80 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. వారానికి 10 శాతం ఆదాయం వస్తుందంటూ ఆశపెట్టారు. అయితే డబ్బు చెల్లించకపోవటంతో యజమానులను నిలదీయటంతో జూలైలో రూ.50 లక్షలకు చెక్కులు ఇచ్చారు మోసగాళ్లు. వాటిలో ఒకటి బౌన్స్ కావటంతో ప్రశ్నించగా కిషోర్ అండ్ గ్యాంగ్ బెదిరింపులకు దిగటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
ఫెయిర్ గ్రో ట్రేడర్స్ బాధితుల సంఖ్య దాదాపు 200 వరకు ఉంటుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తమ సంస్థకు చాలా చోట్ల బ్రాంచీలు కూడా ఉన్నాయంటూ నమ్మబలకటంతో తాము కూడా నమ్మి ఇన్వెస్ట్ చేశామంటూ బాధితులు అంటున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కంపెనీ నంబర్లకు సంప్రదించినా ఎవరూ స్పందించటం లేదని తెలుస్తోంది.