నోముల నర్సింహయ్య పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ ఆడియో

నోముల నర్సింహయ్య పేరుతో  సోషల్ మీడియాలో ఫేక్ ఆడియో

‘జోహార్​ నర్సింహయ్య..’ అంటూ స్పందించిన సీపీఎం లీడర్లు

ఎస్పీకి కుటుంబ సభ్యుల ఫిర్యాదు

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం చనిపోవడానికి ముందు చివరి నిమిషంలో మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో క్లిపింగ్స్​ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ​పార్టీలో కలకలం  రేపింది. గురువారం నర్సింహయ్య అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో…‘నాపై ఎర్రజెండా కప్పి సాగనంపాలి’ అంటూ అచ్చు ఆయన వాయిస్ తో ఆడియో వైరల్​ కావడం హాట్ టాపిక్​గా మారింది.

‘ఉమ్మడి నల్గొండ జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ బిడ్డలకు, కంకణబద్దులైన కామ్రేడ్ సోదరులకు, విప్లవకారులకు ఈ నర్సింహయ్య చెబుతున్నది ఒకటే. ఏదిఏమైనా రేపటి భవిష్యత్తు అంతా కమ్యూనిస్టు పార్టీలదే.. కమ్యూనిస్టు రాజ్యాలదే.. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఇచ్చిన అవకాశంతో గత 30 ఏళ్లుగా ప్రజలకు సేవ చేశాను.  నేను మీకు, ఎర్రజెండాకు రుణపడే ఉన్నాను.. ఇక సెలవు..  నాపై ఎర్రజెండా కప్పి సాగనంపుతారని ఆశిస్తున్నా..’ అంటూ ఉన్న ఆడియోను  చనిపోవడానికి ముందు నర్సింహయ్య మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో పకడ్బందీగా ప్రచారం చేశారు.

నిజంగానే నర్సింహయ్య మాట్లాడినట్లుగా భావించిన టీఆర్ఎస్,  సీపీఎం లీడర్లు షాక్​కు గురయ్యారు. కొందరు సీపీఎం లీడర్లయితే ‘జోహార్.. నర్సింహయ్య’ అంటూ వాట్సప్ గ్రూపుల్లో రిప్లై ఇచ్చారు. పార్టీలో ఆయన సమకాలీనులైన రాష్ట్ర నేతలు సైతం స్పందించారు. నర్సింహయ్య అంత్యక్రియల గురించి సీపీఎం స్టేట్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. కానీ గతంలో సీపీఎం ప్రజానాట్య మండలిలో మిమిక్రీ ఆర్టిస్టుగా పనిచేసిన కోదాడకు చెందిన వ్యక్తి వాయిస్​తో రికార్డు అయినట్లుగా కొందరు పేర్కొన్నారు. ఈ ఆడియో విషయమై నర్సింహయ్య కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఫేక్ ఆడియోలతో తమను ఇబ్బంది పెట్టవద్దంటూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే కుమారుడు భగత్.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.