ఈ రోజుల్లో మగ పిల్లవాడికి పెళ్లి చేయడం అంటే కష్టంగా మారింది. చదువు, ఉద్యోగం, జీవితంలో సెటిల్మెంట్ అంటూ కెరీర్ లేట్ అవ్వటంతో పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. వీళ్లు సెట్ అయ్యేలోపు వీళ్ల వయసుకు సరిజోడైన అమ్మాయిల పెళ్లిళ్లు జరిగిపోవటం.. కొందరు లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో అమ్మాయిలు దొరకటం కష్టంగా మారింది. దీంతో చాలా మంది వయసు ముదిరినా పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి సిచువేషన్ ను క్యాష్ చేసుకుని పెళ్లికాని ప్రసాదులను భలే క్యాష్ చేసుకున్నారు కొందరు కేటుగాళ్లు. అమ్మాయిలు ఉన్నారని.. డబ్బులు వసూల్ చేసి 42 కుటుంబాలకు ఊహించని రీతిలో షాకిచ్చారు. ఆ వివరాలేంటో చూద్దాం..
మధ్యప్రదేశ్ లో జరిగిన పెళ్లిల్ల స్కాం.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివిధ జిల్లాలకు చెందిన 42 మంది పెళ్లి కొడుకులను ఒకేసారి పెళ్లి చేస్తామని చెప్పి మోసం చేసింది ఒక బ్యాచ్. దేవాస్ లోని ఒక మండపానికి రమ్మని చెప్పి.. తీరా ముస్తాబై వస్తే ఊహించని షాకిచ్చారు.
- అనాథ ఆశ్రమంలోని అమ్మాయిల ఫోటోలతో..
పెళ్లి కాకుండా వయసు ముదిరిన వ్యక్తులను టార్గెట్ చేసిన బ్యాచ్.. భారీ స్కాంకు పాల్పడింది. ఇండోర్ సిటీలో అనాథాశ్రమంలో అందమైన అమ్మాయిలు ఉన్నారని ట్రాప్ చేశారు. అందమైన ఫోటోలు చూపించి పెళ్లికి రెడీ చేశారు. అనాథలైతేనేం.. మనకు ఫ్యామిలీ ఉంది కదా.. పెళ్లయితే చాలు అనుకుని 42 మంది పెళ్లికి రెడీ అయ్యారు. కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేసేశారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మే 25న దేవాస్ పట్టణంలో ఒకే వేదికపై.. ఒకే ముహూర్తానికి పెళ్లి చేస్తామని నమ్మించారు. అందుకోసం ఒక్కొక్కరి నుంచి 12 వేల నుంచి 20 వేల రూపాయల వరకు కమిషన్లు వసూలు చేశారు. ఒక్కో ఫ్యామిలీ నుంచి 25 వేల రూపాయలు వసూలు చేసినట్లు కొందరు చెబుతున్నారు. మొత్తం 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసుకుని ఎస్కేప్ అయ్యింది బ్యాచ్.
దేవాస్ లోని ఫంక్షన్ హాల్ కు పెళ్లి కూతుర్లను తీసుకొస్తామని చెప్పి అందుకు ముందు రోజు మే 24న తేక్రి ఆలయంలో పూజలు చేసి.. రాధగంజ్ క్లబ్ గ్రౌండ్ లో ముందస్తు కార్యక్రమాలు చేయనున్నట్లు చెప్పారు . దీంతో మొత్తం 42 మంది పెళ్లి కొడుకులు, కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. కొందరైతే ఉదయం 8 గంటలకే ఫంక్షన్ హాల్ కు వచ్చారట. కానీ అక్కడికి వచ్చి చూస్తే పెళ్లి ఏర్పాట్లు లేవు.. వేడుక లేదు.. పెళ్లి కూతుర్లు లేరు.. అది చూసి పెళ్లి పేరుతో మోసపోయామని లబోదిబోమని అనటమే వారి వంతు అయ్యిందట.
ముకేష్ భైరాగి అతని భార్య సునీత ఈ స్కాం లో కీలక సూత్రదారులుగా పోలీసులు చెబుతున్నారు. పెళ్లిళ్లు చేస్తూ పేరున్న ఈ జంట.. చాలా మందికి పెళ్లి చేస్తామని షూరిటీ ఇచ్చింది. ఇండోర్ లోని అనాధాశ్రమంలో అందమైన అమ్మాయిలు ఉన్నారని.. ఫ్యామిలీకి బాగా సెట్ అవుతుందని నమ్మించారు. అందుకోసం ఫీజు కింద 25 వేల రూపాయలు వసూలు చేశారు. ముహార్త సమయానికి.. దుకాణం ఎత్తేయడంతో షాక్ తిన్నారు.
ఈ కేసులో ముకేష్ బైరాగీ, సునీత బైరాగీ, దినేశ్ బైరాగీ, నర్సింగ్ దాస్ బైరాగీలపై కేసులు పెట్టారు పోలీసులు. కీలక సూత్రదారులైన ముకేష్, సునీతలను అరెస్టు చేశారు. మిగతావారి కోసం దర్యాప్తు చేస్తారు. మే 24న అభిషేక్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
