నట్టేట ముంచుతున్న నకిలీ కన్సల్టెన్సీలు.. హైదరాబాద్‌‌‌‌లోనే 2600 సంస్థలు !

నట్టేట ముంచుతున్న నకిలీ కన్సల్టెన్సీలు.. హైదరాబాద్‌‌‌‌లోనే 2600 సంస్థలు !
  • నట్టేట ముంచుతున్న నకిలీ కన్సల్టెన్సీలు.. హైదరాబాద్‌‌‌‌లోనే 2600 సంస్థలు.. అనుమతులు వందల్లోనే!
  • విదేశీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి వందల కోట్ల వసూళ్లు
  • నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫేక్ ​వర్క్ పర్మిట్లతో బురిడీ
  • బోర్డు తిప్పేస్తున్న వందల సంస్థలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​లో నకిలీ కన్సల్టెన్సీల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గల్ఫ్ జాబ్, యూరప్ వీసా, స్టడీ వర్క్ పర్మిట్, 100 శాతం జాబ్ గ్యారంటీ అంటూ నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నారు. గడిచిన ఐదారేళ్లలో నకిలీ కన్సల్టెన్సీల బారిన పడి నగరానికి చెందిన సుమారు 2,500 మంది నుంచి 3 వేల మంది నిరుద్యోగులు, విద్యార్థులు మోసపోయినట్లు పోలీస్ రికార్డులు, సైబర్ క్రైమ్ డేటా ద్వారా తెలిసింది.

ఇప్పటికే సిటీలో వందలాది నకిలీ ఓవర్సీస్, జాబ్ కన్సల్టెన్సీలు బోర్డు తిప్పేయగా, బాధితుల నుంచి వందల కోట్ల రూపాయలను నిందితులు వసూలు చేశారు. నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చి మోసం చేస్తున్నారు. వీటిని నమ్మి విమానాశ్రయాలకు వెళ్లిన వారిని ఎయిర్ పోర్టులోనే ఆపేస్తుండగా.. మరికొంతమంది విదేశాలకు వెళ్లి అసలు విషయం తెలిసి అక్కడే ఇరుక్కుపోతున్నారు. చివరకు మళ్లీ ఇంటి నుంచే డబ్బులు తెప్పించుకుని ఇండియాకు తిరిగి వస్తున్నారు.

వామ్మో 2,600 కన్సల్టెన్సీలా..?
నగరంలో రెండు రకాల కన్సల్టెన్సీలు నడుస్తున్నాయి. ఒకటి ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీలు కాగా రెండోది పోస్ట్ వర్క్ పర్మిట్ వీసా ఇచ్చే కన్సల్టెన్సీలు కలిపి దాదాపు 2,600 వరకు ఉన్నాయి.  పైచదువుల కోసం వెళ్లే వారికి విదేశాల్లో చదువుతో పాటు పని చేసుకునే అవకాశం ఉంటుందని, లక్షల్లో జీతాలు వస్తాయని నమ్మిస్తాయి.

యూకే, యూఎస్, యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొన్ని వర్సిటీలతో ముందస్తు ఒప్పందం చేసుకుని, ఒక్కో విద్యార్థిని జాయిన్ చేస్తే రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు కమిషన్ పొందుతాయి. విద్యార్థుల నుంచి వీసా ప్రాసెసింగ్, వర్సిటీ ఫీజుల పేరిట లక్షల్లో వసూలు చేస్తాయి. వందలో ఏ ఒక్కరికో ఇద్దరికో వచ్చే సీట్లను చూపించి వందల మంది నుంచి డబ్బులు వసూలు చేస్తారు.

'ఐఈఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్' సాకు.. కమిషన్ల వేట
విదేశాల్లో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి ఇంగ్లిష్ నైపుణ్యాన్ని నిర్ధారించే  ఇంటర్నేషనల్ ఇంగ్లిష్​జ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఎస్) ఉంటుంది. ఇందులో స్కోర్ రాకపోతే, దాన్నే సాకుగా చూపి వీసా రావడం లేదని నెపాన్ని అభ్యర్థిపై తోసేస్తారు. వీసా ప్రాసెస్ జరగకముందే సగం లేదా మొత్తం డబ్బులు వసూలు చేస్తారు. మరికొన్ని కన్సల్టెన్సీలు తాము సూచించిన ఇంగ్లిష్ అకాడమీల్లో జాయిన్ చేయించి కమిషన్లు తీసుకుంటాయి. ఈ ఎగ్జామ్ రాయడానికి ఒక్కోసారి రూ. 15 వేల పైనే అవుతుంది. ట్రైనింగ్, రూమ్ రెంట్ ఖర్చులు రూ. లక్ష దాటుతాయి.

బురిడీ కొట్టించిన ప్రముఖ కేసులు..

  • హఫీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్ రోడ్డు నంబర్10ఏలోని సీడీ దశరథ్ కన్సల్టెన్సీ: ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి వద్ద రూ. 6 లక్షల చొప్పున వసూలు చేసి 90 మందిని ముంచేసింది. అందరినీ ఈజిప్ట్ తీసుకెళ్లి నడిరోడ్డుపై వదిలేయడంతో బాధితులు సొంత ఖర్చులతో తిరిగి వచ్చారు. నిర్వాహకులు అర్చన ప్రియ, స్వామి శంకర్ పరారీలో ఉన్నారు.
  • గచ్చిబౌలిలోని శ్రీ ఇమ్మిగ్రేషన్ అండ్ వీసా కన్సల్టెన్సీ: అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో వీసాలు, ఉద్యోగాలంటూ బీటెక్, ఎంటెక్ విద్యార్థులు 130 మందిని నిర్వాహకులు వేదుల నివేదిత, శ్రీకిరణ్ నమ్మించారు. వారి నుంచి 2024లో ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల-రూ.20 లక్షల  చొప్పున దాదాపు రూ. 10 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది.
  • ఓవర్సీస్ కన్సల్టెన్సీ (జూబ్లీహిల్స్): సోషల్ మీడియా ప్రకటనలతో ఒక్కొక్కరి నుంచి రూ. 4 నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసి నకిలీ వర్క్ ఆథరైజేషన్ లెటర్లు ఇచ్చారు. 15 మంది బాధితుల ఫిర్యాదుతో నిరుపమ, అరుణ్ రాజులను పోలీసులు అరెస్ట్ చేయగా, సీఈఓ సహా మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. ఇదే ముఠా కేపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ కాలనీలోనూ మోసాలకు పాల్పడింది.
  • ట్రివియల్ చాప్టర్ కన్సల్టెన్సీ: గ్రీస్, ఇటలీ, సెర్బియా దేశాల పేరిట 200 మంది నుంచి రూ. 20 కోట్లు వసూలు చేసింది.
  • ఈగిల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్ ​ఇమ్మిగ్రేషన్ (సికింద్రాబాద్): మాల్టా, ఇతర ఐరోపా దేశాలంటూ తెలంగాణ, ఏపీతో కలిపి 100 మందికి పైగా బాధితుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేయగా సీఐడీ ఈ ముఠాను అరెస్ట్ చేసింది.
  • మెహదీపట్నం ఓవర్సీస్ కన్సల్టెన్సీ: యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్టూడెంట్ వీసాల పేరిట 17 మంది నుంచి రూ. కోటి వరకు వసూలు చేసింది.

ఐదు రాష్ట్రాలపై ఆంక్షలు
2023లో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యూఎస్ దేశాలకు ఇండియా నుంచి వచ్చి, ఎడ్యుకేషన్ వీసా ముగిసినా అక్రమంగా ఉంటున్న 9 లక్షల మందిని గుర్తించారు. ఇందులో 35 వేల మంది వరకు హైదరాబాద్ నుంచే ఉన్నట్లు తేలడంతో, 2023లో ఆస్ట్రేలియా ఒకేసారి 800 మందిని ఇండియాకు తిప్పి పంపేసింది. ముఖ్యంగా ఇండియాలోని తెలంగాణ, గుజరాత్, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఇలాంటివి ఎక్కువగా జరుగుతుండటంతో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కఠినతరం చేశారు.

ప్రస్తుతం స్టూడెంట్, వర్క్ పర్మిట్ వీసా అప్లికేషన్లను వందసార్లు చెక్ చేసిన తర్వాతే ప్రొవైడ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ విషయాలేవీ తెలియని వారు, కేంద్ర విదేశాంగ శాఖ అనుమతులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోకుండా ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, యూట్యూబ్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో వచ్చే స్టోరీలను నమ్మి మోసపోతున్నారు. యువత ఆశలను క్యాష్ చేసుకుంటున్న కన్సల్టెన్సీలు డబ్బులు తీసుకుని నకిలీ వీసాలు చేతిలో పెట్టి బోర్డు తిప్పేస్తున్నాయి.