ఫేక్ డాక్యుమెంట్లతో రూ.కోట్ల లోన్

ఫేక్ డాక్యుమెంట్లతో రూ.కోట్ల లోన్

హైదరాబాద్, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను మోసం చేసి కోట్ల రూపాయల రుణం తీసుకున్న వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపిన వివరాల ప్రకారం.. బషీర్ బాగ్ కు చెందిన మారెళ్ల లక్షారెడ్డి(58) నకిలీ డాక్యుమెంట్లతో స్థానిక ఐడీబీఐ బ్యాంకులో రూ.2.80 కోట్ల రుణం తీసుకున్నాడు. గడువు ముగిసినా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించక పోవడంతో లక్ష్మారెడ్డికి బ్యాంకు నోటీసులు ఇచ్చింది. ఆ తరువాత తనాఖా పెట్టిన ప్రాపర్టీని సీజ్ చేసేందుకు బ్యాంకు సిబ్బంది వెళ్లారు. అయితే లక్ష్మారెడ్డి తనఖా పెట్టిన డాక్యుమెంట్లు నకిలీవని తేలింది. ఇవే డాక్యుమెంట్లతో సుల్తాన్ బజార్ లోని మహారాష్ట్ర బ్యాంకులోనూ లోన్ తీసుకున్నట్లు ఐడీబీఐ బ్యాంకు సిబ్బంది గుర్తించారు.

వారే టార్గెట్​..

నకిలీ డాక్యుమెంట్లతో మోసం చేసిన లక్షారెడ్డిపై ఐడీబీఐ బ్యాంకు యాజమాణ్యం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సీసీ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ దర్యాప్తు చేసింది. ఇందులో లక్ష్మారెడ్డి, అతని కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్లు తయారు చేయడంలో మంచి నైపుణ్యం ఉందని పోలీసులు గుర్తించారు. బ్యాంకు రుణాలు అవసరం ఉన్న వారిని టార్గెట్ చేసిన నకిలీ డాక్యుమెంట్లతో రుణాలు పొందుతున్నారని విచారణలో తేలింది. ఇలా ఫేక్ ప్రాపర్టీ పత్రాలతో బ్యాంకు లోన్లు ఇప్పించి రూ.లక్షల్లో కమీషన్లు తీసుకుంటారని వెల్లడైంది. ఇప్పటికే లక్ష్మారెడ్డి మరో కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో లక్ష్మారెడ్డిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.