హైదరాబాద్, వెలుగు : జర్నలిజం, ప్రజా సంబంధాలు అనేవి వృత్తులు మాత్రమే కాదని, ఇవి ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలని ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయెల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించే విషయంలో జర్నలిజం , ప్రజా సంబంధాలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో వియత్నాం అధికారులకు ‘జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు వారాల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్‌ఇన్ మొదలైనవి మీడియా ప్రపంచంలో తీవ్ర పరివర్తనను తీసుకొచ్చాయని తెలిపారు. వీటి వల్ల తప్పుడు సమాచారం, నకిలీ వార్తల విస్తరణ పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల జర్నలిజం సమగ్రతకు, ప్రజల విశ్వాసానికి తీవ్రమైన ముప్పు కలుగుతోందన్నారు.
