నకిలీ నోట్ల తయారీ ముఠా గుట్టు రట్టు

నకిలీ నోట్ల తయారీ ముఠా గుట్టు రట్టు

హసన్ పర్తి, వెలుగు : కారులో నకిలీ నోట్లను తరలిస్తున్న  నలుగురు ముఠా సభ్యులను కాకతీయ యూనివర్సిటీ, టాక్స్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.85 వేల నగదు, రూ.4 లక్షల నకిలీ కరెన్సీ, 2 కార్లు ,5 సెల్ ఫోన్లు, నకిలీ నోట్లు తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ సీఐ అబ్బయ్య తెలిపిన వివరాల ప్రకారం... ములుగు ఘనపూర్ కి చెందిన పోరిక రాజ్ కుమార్, అతని స్నేహితులు బూర శ్రీకాంత్, రాజేశ్, మంతెన కావ్య ముఠాగా ఏర్పడ్డారు. 

ఈ క్రమంలో రాజ్ కుమార్.. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన పఠాన్ అలియాస్  హుస్సేన్  అనే వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. ఎవరికైనా నకిలీ నోట్లు కావాలంటే ఇస్తానని, అలాంటి వాళ్లని తన దగ్గరికి పంపితే వచ్చిన లాభం నుంచి సగం ఇస్తానని రాజ్ కుమార్  చెప్పాడు. దీంతో  పఠాన్ తనకు పరిచయమున్న ఓంకార్ విశ్వనాథరావు బూరే, విష్ణు కవాల్ ను హనుమకొండకు వెళ్లాలని చెప్పాడు. వారు నాందేడ్  నుంచి కారులో డ్రైవర్  సంభాజీ తో కలిసి హన్మకొండలోని పబ్లిక్  గార్డెన్  వద్ద  రాజ్ కుమార్ ను కలిశారు. 

రెండు లక్షలు అసలు నగదు ఇస్తే రూ.4 లక్షల నకిలీ నోట్లు ఇస్తానని రాజ్ కుమార్  చెప్పాడు. దీంతో వారు రెండు  లక్షలు ఇచ్చి రూ.4 లక్షల నకిలీ నోట్లు తీసుకున్నారు. అనంతరం రాజ్ కుమార్, అతని ఇద్దరు స్నేహితులు రెండు కార్లలో వెళ్తుండగా.. చింతగట్టు బ్రిడ్జి వద్ద కాకతీయ యూనివర్సిటీ  పోలీసులు తనిఖీల్లో భాగంగా వారి వాహనాలను ఆపారు. రెండు కార్లను పరిశీలించగా వెహికల్స్ లో నకిలీ కరెన్సీ నోట్లు దొరికాయి. రాజ్ కుమార్, ఓంకార్ విశ్వనాథరావు బూరే, విష్ణు కవాల్, డ్రైవర్  సంభాజీని అరెస్టు చేశారు. రాజేశ్, బూర శ్రీకాంత్  పరారీలో ఉన్నారు.