నడిగడ్డ రైతులను నిండా ముంచిన నకిలీ సీడ్స్​, భారీ వర్షాలు

నడిగడ్డ రైతులను నిండా ముంచిన నకిలీ సీడ్స్​, భారీ వర్షాలు
  • చేన్లు ఏపుగా పెరిగినా పూత లేదు.. కాత లేదు..
  • లక్షల ఎకరాల్లో సగానికి పైగా తగ్గిన దిగుబడి 
  • భారీగా నష్టపోయామని పత్తి రైతుల ఆవేదన
  • ప్రభుత్వం ఆదుకోవాలని విన్నపం

గద్వాల, వెలుగు: నకిలీ విత్తనాలు.. భారీ వర్షాలు ఈ యేడు నడిగడ్డ పత్తి రైతులను నిండా ముంచాయి. సర్టిఫైడ్​విత్తనాలని చెప్పి కొన్ని షాపుల యజమానులు అంటగట్టిన నకిలీ సీడ్స్ నాటిన కొందరు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేను ఏపుగా పెరిగినా.. పూత, కాత రాకపోవడంతో ఏమీ చేయలేక రైతులు ఎదిగిన చేనును పీకివేస్తున్నారు. తెరపివ్వకుండా పడుతున్న వానలకు పెట్టుబడికి సరిపడా కూడా పత్తి దిగుబడి   వచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పులెట్లా తీర్చాలని లబోదిబోమంటున్నారు. 

భారీగా పత్తి సాగు
గద్వాల జిల్లాలో  రైతులు భారీగా సీడ్, కమర్షియల్ పత్తి పంటలను సాగు చేస్తుంటారు. ఈ యేడు 2 లక్షల 20 వేల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేశారు. అందులో 40 వేల ఎకరాల వరకు సీడ్ పంట పోను మిగతా 1.80 లక్షల ఎకరాల్లో కమర్షియల్ పంట సాగు చేస్తున్నారు. ఇందులో నకిలీ సీడ్స్ వేసి దాదాపు 25వేల ఎకరాల్లో రైతులు నిండా మునగగా..  లక్షా 55 వేల ఎకరాల్లో భారీ వర్షాలకు పంట దిగుబడి సగానికి పైగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. సాధారణంగా పత్తి ఎకరానికి  10 నుంచి 12 క్వింటాళ్ల  దిగుబడి వస్తుంది.. కానీ  ఈ యేడు 5 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేలా లేదని, పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. నకిలీ విత్తనాలు నాటిన రైతులు చేను ఏపుగా పెరిగినా పూత, కాత లేకపోవడంతో పీకేస్తున్నారు. భారీ వర్షాలకు ఎర్ర పురుగు, టోబెక్ స్విస్ వైరస్ తో వచ్చిన ఊడ  వచ్చింది వచ్చినట్లే రాలిపోతుందని అగ్రికల్చర్​ఆఫీసర్లు చెబుతున్నారు.

నకిలీ సీడ్స్ తో రైతులకు నష్టం


ఐజ మండలం సంకాపురం, ఈడుగోనిపల్లి గ్రామాల్లోని రైతులు  దాదాపు 25వేల ఎకరాల్లో పాలమూరు సీడ్స్ ‘పీసీహెచ్-66 బీటీ-2 బంజన్’ రకం విత్తనాలు నాటారు. ఈ విత్తనాలు నాటిన వరకు చేను ఏపుగా పెరిగినా.. అసలు పూతే రాలేదని రైతులు వాపోతున్నారు. అయితే ఎకరా పత్తి పంట సాగు చేయాలంటే రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నిండా మునిగామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నకిలీ విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. 

పూత, పిందె పడలే..
నాకు ఉన్న 5 ఎకరాల పొలంలో కమర్షియల్ పత్తి విత్తనాలు నాటిన. చేను ఏపుగా పెరగడంతో ఈ యేడు పత్తి దిగుబడి భారీగా వస్తుందని ఆశ పడ్డా.  కానీ ఇప్పటి వరకు చూద్దామన్నా.. పూత కనిపించడం లేదు. ఇప్పటికే సుమారు లక్షకు పైగా  అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాను. అప్పు ఎట్లా తీర్చాలో అర్థమైతలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– వెంకట్ రాములు, రైతు, ఈడుగోనిపల్లి

సైంటిస్టులతో పంటలను పరిశీలిస్తాం
ఈ సారి భారీ వర్షాలతో  నల్లరేగడి వంటి కొన్ని నేలల్లో పత్తి రైతులకు కొంత మేర నష్టం జరిగింది.  కొన్ని పొలాలలో పూత, కాత నిలుస్తలేదు. ఇది వరకే అగ్రికల్చర్​సైంటిస్టులు వచ్చి  పత్తి పంటను పరిశీలించారు. మరొక సారి  పత్తి చేన్లను పరిశీలించాలని సైంటిస్టులను కోరుతాం. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయిన విషయాన్ని పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.
– గోవిందు నాయక్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్