రాష్ట్రంలో జోరుగా నకిలీ విత్తనాలు దందా

రాష్ట్రంలో జోరుగా నకిలీ విత్తనాలు దందా

రాష్ట్రంలో నకిలీ విత్తనాల దందా మళ్లీ జోరందుకుంది. ఈ మధ్య కొత్తగూడెం, జోగులాంబ జిల్లాలో 33లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు దొరకాయి. తాము కొనుగోలు చేసే విత్తనాలు అసలివో లేక నకిలివో తెలియక తలలు పట్టుకుంటున్నారు రైతులు. ఏటా అధికారులు తనిఖీలు చేసి.. కేసులు పెట్టడం ఆ తరువాత మరిచిపోవడం కామన్ గా మారిపోయిందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. నకిలీ విత్తనాలు అమ్ముతున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఏటా దందా సాగుతుందంటున్నారు రైతులు. నకిలి విత్తనాలు అమ్మిన కంపెనీలపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు.విత్తనాలు సరఫరా చేసిన కంపెనీ లైసెన్స్ రద్దు చేయాలంటున్నారు.

నకిలీ విత్తనాల వల్ల  పంట నష్టంతో పాటు.. ఏటేటా  సాగు విస్తీర్ణం కూడా తగ్గుతుందంటున్నారు రైతులు. అయితే ఈసారి ఖరీప్ సాగుకు సంబంధించి పత్తి, కందులు, పెసళ్లు, మినుములు, సోయాబీన్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నా…  రైతులకు అందడం లేవంటున్నారు.

ప్రతి గ్రామంలో ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలంటున్నారు రైతులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున నకిలీ పత్తి, వరి విత్తనాలు పట్టుబడుతున్నాయి. అనుమతి లేని విత్తనాలను గుట్టు చప్పుడు కాకుండా పల్లెల్లో అమ్ముతున్నారు వ్యాపారులు. ఇప్పటికే హుజురాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ గోడౌన్ లో నిల్వచేసిన 70 లక్షల విలువైన పత్తి విత్తనాలను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మరో 3 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.