ఫాల్కన్ కొనేందుకు నో ఇంట్రెస్ట్..ఆన్‌‌లైన్‌‌లో ఆక్షన్ కు పెట్టిన ఈడీ

ఫాల్కన్ కొనేందుకు నో ఇంట్రెస్ట్..ఆన్‌‌లైన్‌‌లో ఆక్షన్ కు పెట్టిన ఈడీ
  • రూ.14 కోట్ల విలువైన ఎయిర్ అంబులెన్స్​ను 
  • ముందుకురాని కొనుగోలుదారులు

హైదరాబాద్‌‌, వెలుగు: ఫాల్కన్‌‌  కేసులో ఈడీ సీజ్‌‌ చేసిన హాకర్‌‌‌‌ ఏ ఎయిర్ క్రాఫ్ట్‌‌ ను కొనుగోలు చేసేందుకు ఆశించిన స్థాయిలో ఈ–వేలం అప్లికేషన్లు  రాలేదు. దీంతోపాటు విమానం వేలంలో పలు సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి. ఎయిర్ క్రాఫ్ట్​కు చెందిన వివిధ పత్రాలకు సంబంధించి అవాంతరాలు ఎదురైనట్లు తెలిసింది. కాగా.. ఈడీ ప్రకటించిన షెడ్యూల్‌‌  ప్రకారం ఈ నెల 9న నిర్వహించాల్సిన ఈ వేలం వాయిదా పడింది. 

సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కరించి వీలైనంత త్వరలోనే ఎయిర్ క్రాఫ్ట్‌‌ను ఆన్ లైన్ లో వేలం వేస్తామని ఈడీ అధికారులు తెలిపారు. ఇన్‌‌వాయిస్  డిస్కౌంటింగ్  పేరుతో రూ.792 కోట్లు  మోసం చేసిన కేసులో ఫాల్కన్  క్యాపిటల్ ప్రొటెక్షన్  ఫోర్స్  ప్రైవేట్  లిమిటెడ్‌‌కు చెందిన ఎయిర్‌‌ క్రాఫ్ట్​ ఈ ఏడాది మార్చి 7న శంషాబాద్‌‌ ఎయిర్ పోర్టులో ఈడీ సీజ్‌‌ చేసింది. 

అడ్జుడికేటింగ్  అథారిటీ నిబంధనల ప్రకారం విమానాన్ని వేలం వేసేందుకు నవంబర్‌‌ 20‌‌న అనుమతులు తీసుకుంది. కాగా.. మెటల్  స్క్రాప్‌‌ట్రేడ్  కార్పొరేషన్‌‌ (ఎమ్‌‌ఎస్‌‌టీసీ) లిమిటెడ్‌‌  ద్వారా ఈ–వేలం వేయనున్నట్లు ఈ నెల 2న ఈడీ ప్రకటించింది. 

వేలంలో పాల్గొనాలనుకునే వారు 7వ తేదీ నుంచి బేగంపేట ఎయిర్‌‌‌‌పోర్టులో ఎయిర్ క్రాఫ్ట్‌‌ను తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది. పరిశీలనల అనంతరం 9న ఈ వేలం నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే.. సాంకేతిక సమస్యల కారణంగా ఈ వేలం వాయిదా పడింది. రూ.14 కోట్లకు పైగా విలువ చేసే ఎయిర్ క్రాఫ్ట్‌‌ను ఫాల్కన్‌‌  సంస్థ నిర్వాహకులు ఎయిర్‌‌‌‌ అంబులెన్స్‌‌గా వినియోగించారు.

 ఇంటీరియర్  కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అమర్‌‌‌‌దీప్‌‌ కుమార్‌‌ ‌‌ విదేశాలకు పారిపోగా అతని సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్  అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్, క్యాపిటల్  ప్రొటెక్షన్  ఫోర్స్ ప్రైవేట్  లిమిటెడ్  సీఓఓ ఆర్యన్ సింగ్  చాబ్రాను ఈడీ ఇప్పటికే అరెస్ట్‌‌  చేసింది. ఎయిర్ క్రాఫ్ట్‌‌ సహా రూ.18.63 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది.