హిందువులపై తప్పుడు కేసులు పెడ్తున్నరు.. అణచివేతతో బీజేపీని ఆపలేరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌ రావు

హిందువులపై తప్పుడు కేసులు పెడ్తున్నరు.. అణచివేతతో బీజేపీని ఆపలేరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌ రావు

బాన్సువాడ, వెలుగు : రాష్ట్రంలో హిందువులపై తప్పుడు కేసులు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌‌‌రావు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బుధవారం జరిగిన పండిట్‌‌‌‌ దీనదయాళ్‌‌‌‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్‌‌‌‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారని విమర్శించారు. అణచివేత ద్వారా బీజేపీ ఎదుగుదలను ఆపలేరని, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. రైతులు, స్టూడెంట్లతో పాటు అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి బుద్ధి చెప్పాలంటే పోరాటమే మార్గమన్నారు. ప్రభుత్వం చివరి గింజ కొనేవరకు ఉద్యమం చేస్తామని, అందుకోసమే ‘రైతు గోస బీజేపీ భరోసా’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. యుద్ధం కారణంగా సంక్షోభం ఏర్పడినప్పటికీ, ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ మహిళా బిల్లును అడ్డుకొని, వారికి అన్యాయం చేసిందన్నారు. ఎంఐఎం చెప్పినట్లు కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వింటున్నాయని ఎద్దేవా చేశాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు అరుణతార, మాజీమంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మురళీధర్‌‌‌‌గౌడ్‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం ఇటీవల బాన్సువాడలో జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలతో రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ సమావేశం నిర్వహించారు. తమపై తప్పుడు కేసులు బనాయించారని, రౌడీషీట్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేశారని బాధితులు చెప్పడంతో... తాను డీజీపీతో మాట్లాడుతానని రాంచందర్‌‌‌‌రావు హామీ ఇచ్చారు.