ఫేక్​ న్యూస్​తో టీఆర్​ఎస్​ పేకుడు 

ఫేక్​ న్యూస్​తో టీఆర్​ఎస్​ పేకుడు 
  • ‘వీ6-వెలుగు’ పేరిట తప్పుడు వార్తల ప్రచారం
  • ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అధికార పార్టీ లీడర్లది ఇదే కత
  • జీహెచ్​ఎంసీ, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఫేక్​ సర్వేలు
  • ఇప్పుడు హుజూరాబాద్​ బైపోల్​లో పబ్బం గడుపుకునేందుకు 
  • ఈటలకు వ్యతిరేకంగా క్లిప్పింగ్​లు గతంలో ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు 

నెట్​వర్క్​, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎట్లయినా గెలవాలని ఆరాటపడుతున్న టీఆర్​ఎస్​ లీడర్లు సోషల్​ మీడియా వేదికగా గోబెల్స్​ ప్రచారానికి తెరతీశారు. జరగనిది జరిగినట్లు, జరిగింది జరగనట్లు ఫేక్​ న్యూస్​ క్రియేట్​ చేసి జనాల్లోకి వదులుతున్నారు. నిఖార్సైన వార్తలతో అనతికాలంలోనే తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న ‘వీ6– వెలుగు’ క్రెడిబిలిటీని ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇదివరకు జీహెచ్​ఎంసీ, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎలక్షన్స్​ టైంలో ‘వీ6–వెలుగు’ పేరిట ఫేక్​ సర్వేలను వైరల్​ చేసి ఓటర్లను గందరగోళానికి గురిచేశారు. తాజాగా హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​కు, బీజేపీకి వ్యతిరేకంగా ఫేక్​ న్యూస్​ క్లిప్పింగులు తయారుచేసి వాట్సప్​, ఫేస్​బుక్​లో వైరల్​ చేస్తున్నారు.

జనరల్​ ఎలక్షన్స్​, బై పోల్స్​, మున్సిపోల్స్​.. ఇలా ఎన్నిక ఏదైనా పార్టీలన్నీ ముందుగా సోషల్​ మీడియాలోనే క్యాంపెయిన్​ ప్రారంభిస్తున్నాయి. ఆయా పార్టీలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంతోపాటు కొత్తగా చేపట్టబోయే స్కీమ్​లు, హామీలను జనాల్లోకి తీసుకెళ్తున్నాయి. తద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని పార్టీలు ఓ అడుగు ముందుకేసి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ఆరోపణలకు కూడా సోషల్​ మీడియాను అడ్డంగా వాడుకుంటున్నాయి. ఈ విషయంలో రూలింగ్​పార్టీ  లీడర్లు నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. మామూలుగా చెబితే జనం నమ్మరు కనుక తెలంగాణలో అత్యధిక క్రెడిబిలిటీ ఉన్న  ‘వీ6– వెలుగు’ పేరిట ఫేక్ సర్వేలు, ఫేక్​ న్యూస్​, ఫేక్​ స్టోరీస్​ సృష్టించి వైరల్​ చేస్తున్నారు. లోగోతో పాటు అచ్చు ‘వెలుగు’ పేపర్​లో  పబ్లిష్​ అయినట్లుగానే ఈ ఫేక్​ క్లిప్పింగులు ఉండడంతో జనం కూడా వీటిని నమ్మే ప్రమాదం ఉంది. రూలింగ్​ పార్టీ లీడర్లు  ఆశించేది కూడా ఇదే! అందుకే ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల  టైంలో ‘వీ6–వెలుగు’ సర్వే చేసినట్లు, టీఆర్​ఎస్​ క్యాండిడేట్లు ఇద్దరు బంపర్​ మెజారిటీతో గెలవబోతున్నట్లు ఫేక్​ క్లిపింగ్స్ ​వైరల్​ చేశారు.  అంతకుముందు డిసెంబర్​ నెలలో జరిగిన జీహెచ్​ఎంసీ ఎన్నికలప్పుడు ఇట్లనే టీఆర్​ఎస్​కు 92–101 సీట్లు, బీజేపీకి 10–12 సీట్లు వస్తాయని ‘వీ6–వెలుగు’ పేరిట ఫేక్​ సర్వే క్లిపింగ్​ తయారుచేసి సోషల్​ మీడియాలో వదిలారు. ఈ ఫేక్​ సర్వేలను సర్క్యులేట్​ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని నవంబర్​28న  ‘వీ6 –వెలుగు’ ప్రతినిధి సంపత్​కుమార్​.. సైబర్​ క్రైమ్​ ఏసీపీ కేవీ ఎం ప్రసాద్​కు ఫిర్యాదు చేశారు. వాట్సప్​ పోస్టింగ్స్​, యూఆర్​ఎల్​ లింక్స్​ను కూడా ఆయనకు అందజేశారు. బండి సంజయ్​ పేరుతో మార్ఫింగ్​ అయిన బ్రేకింగ్  న్యూస్​ పైనా  కంప్లయింట్​ ఇచ్చారు. నిందితులను గుర్తించి యాక్షన్​ తీసుకుంటామని ఆనాడు ఏసీపీ హామీ ఇచ్చినా నేటికీ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. 
హుజూరాబాద్​లో  600 మందితో సోషల్​ వారియర్స్​
రాబోయే హుజూరాబాద్​ ఎన్నికల కోసం చెన్నూరు ఎమ్మెల్యే  బాల్క సుమన్ నేతృత్వంలో ‘​సోషల్ మీడియా వారియర్స్’ పేరిట ఏకంగా ఓ స్పెషల్​టీమ్​ను  టీఆర్​ఎస్​ రంగంలోకి దించింది. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 600 మంది యూత్​తో ఈ వింగ్​ను రన్​ చేస్తోంది. వాళ్ల ఖర్చులు, అవసరాలను పార్టీనే భరిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల  మండలాల వారీగా హుజూరాబాద్​, జమ్మికుంట, ఇల్లందకుంటలో వారియర్స్​తో మీటింగ్​ పెట్టిన బాల్క సుమన్​ ప్రచారానికి సోషల్​ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో లెక్చర్ ఇచ్చారు. ప్రభుత్వ స్కీములను ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల విమర్శలను, ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనే విషయంలోనూ గైడ్ ​చేశారు. హైదరాబాద్​ నుంచి రప్పించిన ఎక్స్​పర్ట్స్​తో ట్రైనింగ్​ కూడా ఇప్పించారు. పది రోజుల కింద హుజూరాబాద్​లో జరిగిన మీటింగ్​లో బాల్క సుమన్​‘ఇక సోషల్​ మీడియాలో ప్రతిపక్షపార్టీల సంగతి చూస్తాం’ అని హెచ్చరించారు. ఆ వెంటనే రెండు ఫేక్ న్యూస్​లు  సోషల్ మీడియాలో  స్ప్రెడ్ చేశారు. వీటిలో సీఎం కేసీఆర్​కు ఈటల రాజేందర్  రాసినట్లుగాఉన్న లెటర్​ ఒకటి.. అంబేద్కర్​ విగ్రహానికి బీజేపీ కండువా కప్పారన్న ఫొటో న్యూస్​ మరోటి. ఈ రెండూ ఫేక్ అని, బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని బీజేపీ లీడర్లు లోకల్​ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. 
తప్పుడు వార్తలతో పబ్బం
ఈటల రాజేందర్ కమలాపూర్ లో ప్రెస్​మీట్​ పెట్టి  ‘రెడ్లు, ముస్లింల ఓట్లు నాకు అవసరం లేదు’ అని మాట్లాడినట్లుగా ఓ ఫేక్ న్యూస్ ను టీఆర్​ఎస్​ లీడర్లు  క్రియేట్ చేసి వైరల్​ చేశారు. ఆ మరునాడే.. ఈటల హుజూరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి కమలాపూర్ లో తాను చేసిన వ్యాఖ్యలను తానే ఖండించినట్లుగా, ‘రెడ్లకు రైతుబంధు అవసరం లేదు’ అని మరో వివాదాస్పద వ్యాఖ్య చేసినట్లుగా మరో ఫేక్​ న్యూస్​ను క్రియేట్​ చేశారు. ఇది జులై 1న  ‘వెలుగు’ పేపర్​లో పబ్లిష్​ అయినట్లుగా క్లిప్పింగ్​ తయారుచేసి సోషల్​ మీడియాలో స్ర్పెడ్​చేశారు. ఈ నెల 7న పీసీసీ చీఫ్​రేవంత్​ను ఈటల రాజేందర్​ తిట్టినట్లు మరో క్లిప్పింగ్​ను  తయారుచేసి వదిలారు. ఈ రెండు క్లిప్పింగ్​లకూ ‘వీ6–వెలుగు’ లోగోను వాడుకున్నారు. ఇట్లా అధికార పార్టీ లీడర్లు  ఫేక్​ న్యూస్​ను క్రియేట్​ చేసి హుజూరాబాద్​లో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.