రెండో రోజు స్పీడ్ పెరిగింది

రెండో రోజు స్పీడ్ పెరిగింది
  • ఆదివారం 69 వేల కుటుంబాల సర్వే పూర్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​  పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సాఫీగా సాగుతోంది. రెండో రోజు ఆదివారం అధికారులు స్పీడ్​ పెంచారు. శనివారం మందకొడిగా 35 వేల ఇండ్లను సర్వే చేయగా, ఆదివారం 68,624 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. సర్వేను కో ఆర్డినేట్​కు, మానిటరింగ్​చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జోన్ల వారీగా పలువురు ఐఏఎస్​అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో స్పీడ్​పెరిగింది. సర్వే పత్రాలను భద్రంగా నిల్వ చేయడానికి, అవసరమైన సామగ్రి కొనడానికి జోనల్​ఫండ్స్​ఉపయోగించుకోవచ్చని జోనల్ కమిషనర్లను అడిషనల్​కమిషనర్​ మంగతాయారు ఆదేశించారు.

 
పంజాగుట్ట/ఎల్బీనగర్/ఇబ్రహీంపట్నం/జీడిమెట్ల: మధురానగర్​లోని తన నివాసంలో హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ తన కుటుంబ వివరాలను ఆయనే స్వయంగా నమోదు చేశారు. ఎల్బీనగర్ సర్కిల్ హయత్ నగర్, సరూర్ నగర్ పరిధిలో జరుగుతున్న సర్వేను జోన్ నోడల్ అధికారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్​మెంట్ డిప్యూటీ సెక్రటరీ సీహెచ్ ప్రియాంక పరిశీలించారు. సర్వే చేస్తున్న అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. సమగ్ర ఇంటింటి సర్వే 15 రోజుల్లో పూర్తవుతుందని, ఆ తదుపరి 10 రోజులు డేటాను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.