చందానగర్, వెలుగు: ఓ వృద్ధుడు బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి అవయవాలు డొనేట్ చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. చందానగర్ గంగారంలోని శ్రీసాయి గాయత్రి రెసిడెన్సీలో పీతల యెల్లాజిరావు(65) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 17న ఇంట్లో స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. కుటుంబసభ్యులు లేపి మంచినీరు తాగించడంతో సాధారణ స్థితికి వచ్చాడు. ఉదయం 11.30 గంటలకు వాకింగ్ కోసమని ఇంటి నుండి బయటకు వచ్చాడు.
జేపీ సినిమా రోడ్డులో మళ్లీ పడిపోవడంతో గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు యోల్లాజిరావును మదీనగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ 19న రాత్రి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. జీవన్‌దాన్ ట్రస్ట్ సభ్యులు అతని కళ్లు, గుండె, లివర్, కిడ్నీలతో పాటు ఇతర అవయవాలు సేకరించి అవసరం ఉన్నవారికి అమర్చుతామని తెలిపారు.
