లివిన్ జంటలకూ కుటుంబ హోదా.. జనాభా లెక్కల్లో కేంద్రం కీలక మార్పులు

లివిన్ జంటలకూ కుటుంబ హోదా.. జనాభా లెక్కల్లో కేంద్రం కీలక మార్పులు
  • సెన్సస్‌‌ 2027 వివరాలు వెల్లడించిన రిజిస్ట్రార్ జనరల్

జనగణనలో కేంద్రం కీలక మార్పును చేసింది. ఒకే ఇంట్లో ఏండ్లుగా సహజీవనం చేస్తున్న జంటలను వివాహితులుగానే పరిగణించాలని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌‌ 1 నుంచి 16వ జనాభా గణన ప్రారంభం కానుంది.

న్యూఢిల్లీ: 2027 జనాభా గణనలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును చేపట్టింది. ఒకే ఇంట్లో ఏండ్లుగా కలిసి జీవిస్తున్న సహజీవన జంటలను వివాహిత జంటలుగానే పరిగణించాలని కేంద్రం ప్రకటించింది. గతంలో కూడా ఎన్యూమరేటర్లు అడిగినప్పుడు జంటలు తమను వివాహితులుగా చెప్పుకుంటే.. అలాగే నమోదు చేసేవారు. కానీ అధికారికంగా స్పష్టత ఇవ్వడం ఇదే తొలిసారి. ఈమేరకు జనగణన ప్రక్రియ వివరాలను రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ సోమవారం మీడియాకు వివరించారు. 

దేశవ్యాప్తంగా ఏప్రిల్‌‌ 1 నుంచి 16వ జనాభా గణన ప్రక్రియ ప్రారంభం కానున్నదని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఎన్యూమరేటర్లకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని కోరారు. సేకరించిన వ్యక్తిగత సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని, దీనిని ఏ ప్రభుత్వ పథకాల ప్రయోజనాల కోసం లేదా కోర్టుల్లో సాక్ష్యంగా ఉపయోగించడానికి వీలుండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలతో పంచుకోబోమని, చివరికి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కూడా ఈ వివరాలను ఎవరూ పొందలేరని స్పష్టం చేశారు.

తొలిసారిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్‌‌
ఈసారి డిజిటల్ పద్ధతిలో ప్రజలే స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ సౌకర్యాన్ని కల్పించినట్టు మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. రాష్ట్రాలు నోటిఫై చేసిన తేదీల ప్రకారం.. హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ప్రారంభానికి 15 రోజుల ముందు ఈ విండో అందుబాటులో ఉంటుందన్నారు.

తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య రాష్ట్రాల వారీగా 30 రోజుల వ్యవధిలో హౌస్‌‌ లిస్టింగ్‌‌ చేపడుతారని తెలిపారు. 2027 మార్చి 1ని ప్రామాణిక తేదీగా తీసుకుని (లడఖ్, జమ్మూ కాశ్మీర్‌‌‌‌లాంటి మంచు ప్రాంతాలు మినహా) రెండో విడతలో జనభా గణన ఉంటుందని తెలిపారు.

ఈసారి మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ డేటా సేకరిస్తారన్నారు. గణన సమయంలో ప్రజల నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను సేకరించబోరని తెలిపారు. ప్రతి ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌‌వైజర్ ఉంటారని, తప్పులు జరగకుండా డేటాను సరిచూస్తారన్నారు. ఎన్‌‌పీఆర్‌‌‌‌ అప్‌‌డేషన్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కమిషనర్ స్పష్టం చేశారు. కాగా, సెన్సన్‌‌ 2027 కోసం కేంద్రం 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించింది. ఇంటి యజమాని, అతని వ్యక్తిగత వివరాలు, కులం, కమ్యూనిటీకి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిఉంటుంది.