కోరుట్ల, వెలుగు: మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం జరుగుతుండడంతో ఆయన ఫ్యామిలీ ఆందోళన చెందుతున్నది. పోలీసులు హిడ్మాను ఎన్‌కౌంటర్ చేసినట్టే, దేవ్‌జీని కూడా చంపేస్తారేమోనంటూ భయపడుతున్నది. ఉమ్మడి కరీంనగర్‌లోని కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి దాదాపు 40 ఏండ్ల కింద ఉద్యమంలోకి వెళ్లారు. ఆయన తమ్ముడు గంగాధర్ బుధవారం ‘వీ6 వెలుగు’తో మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబంలో తిరుపతినే పెద్దవాడు.
అన్న 40 ఏండ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అప్పటి నుంచి మా కుటుంబాన్ని కలవలేదు. అన్న ఎక్కడ ఉన్నా క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుంటున్నాం. మా అన్న రాక కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నాం. మీడియాలో వస్తున్న వార్తలు మమ్మల్ని తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి” అని వాపోయారు. ఒకవేళ తన అన్న నిజంగానే పోలీసుల అదుపులో ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ‘పెదనాన్న ఇంటికి వచ్చేయండి’ అంటూ తిరుపతి తమ్ముడి కూతురు సుమ 6 నెలల కింద సోషల్ మీడియా వేదికగా ఒక లేఖ విడుదల చేసింది.
