బషీర్‌బాగ్, వెలుగు: ఐబొమ్మ కేసులో అరెస్టయిన ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు సినిమా పైరసీ మూవీ రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న రవిని ఈ నెల14న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల పాటు రవిని కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ వేయగా.. ఐదు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడిని గురువారం కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసుపై ఈడీ ఇప్పటికే దృష్టి సారించింది. కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.
