భారత సైన్యంలో తెలంగాణ వాటా ఎంత ?

భారత సైన్యంలో తెలంగాణ వాటా ఎంత ?

ప్రపంచ జనాభాలో అతి పెద్దదేశంగా ఉన్న భారత్​లో  సుమారు 12.5 లక్షల  క్రియాశీల, 9 లక్షల రిజర్వ్ సైనికులు దేశ సరిహద్దులో కాపలా కాస్తున్నారు. దేశ రక్షణ కోసం త్రివిధ దళాలకు ఇంధనంలాంటి సైనికులను అందిస్తున్న రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర,  జమ్ము కాశ్మీర్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటే... అభివృద్ధిలో నంబర్​వన్ అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం వెనుకబాటులో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయి 29వ స్టేట్​గా  తెలంగాణ ఏర్పడింది. పది జిల్లాలు ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పడ్డాయి. 

రక్షణ శాఖ సైనిక స్కూళ్లు తెలంగాణకు ఇవ్వాలనుకున్నా.. సంబంధిత వనరుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపినట్లు లేదు. 12 ఏళ్లుగా విద్యార్థి దశ నుండే  దేశభక్తిని రంగరించి చెప్పే సైనిక స్కూళ్లు ఒక్కటి కూడా ఏర్పాటు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వానికి నిదర్శనం.  24  ఎన్​సీసీ బెటాలియన్లు,  ఒకటో రెండో గురుకుల పాఠశాలలో సైనిక శిక్షణ తప్ప పూర్తిస్థాయిలో సైనిక స్కూళ్లు లేకపోవడం శోచనీయం.

యువత  సైన్యంలో  చేరడానికి ఆసక్తి  కనబరచడంలో,   సైన్యంలో  చేరి పదవీ విరమణ పొందిన సైనికుల సంక్షేమంలో... సైనిక సంక్షేమ కార్యాలయాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.  కానీ, తెలంగాణలో  సైనిక  సంక్షేమ కార్యాలయాల పాత్ర నామమాత్రంగా ఉన్నది.  తెలంగాణలోని 33  జిల్లాలలో  ఇప్పటివరకు  పూర్తిస్థాయిలో  కార్యాలయాలు ఏర్పాటు కాలేదు.  ఉన్న కార్యాలయాలలో ఉద్యోగులు పూర్తిగా లేరు.   పదవీ విరమణ పొందిన మాజీ సైనికుల సంక్షేమంలో సైనిక సంక్షేమ కార్యాలయాలు అలసత్వం వహిస్తున్నాయి

సెక్యూరిటీ గార్డులుగా మాజీ సైనికులు
18 సంవత్సరాల వయసులో సాయుధ దళాలలో భర్తీ అయిన సైనికుడు తన యవ్వనాన్ని  15 నుండి 20 సంవత్సరాల దేశసేవకు అంకితం చేస్తాడు. ఆ తర్వాత 35 నుండి 40 సంవత్సరాల వయసులో పదవీ విరమణ పొందుతాడు. కూడు,  గూడు,  గుడ్డ కోసం  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్​తో  రీ సెటిల్మెంట్ లో  భాగంగా  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న 2% రిజర్వేషన్ పోస్టులలో  తెలంగాణ  ప్రభుత్వం  విధించిన 40% క్వాలిఫై మార్కులతో జనరల్ కేటగిరీలో  పోటీపడలేక అర్హత  కోల్పోతున్నాడు.

ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేటు ఉద్యోగాలలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న మాజీ సైనికులే అధికం. బార్డర్లో  తలెత్తుకొని దేశ సేవ చేసిన సైనికులు పదవీ విరమణ తర్వాత రాష్ట్రాలలో గౌరవంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాల్సిన వాళ్లు సెక్యూరిటీ గార్డులుగా జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మాజీ సైనికుల సంక్షేమం కోసం ఉద్యోగ భద్రత లాంటి చట్టాలు చేస్తేనే యువత సైన్యంలో చేరడానికి ఆసక్తి కనబరుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు నలభై వేల మాజీ సైనికులు ఉన్నారు.. సుమారు పది వేల సైనికులు సైన్యంలో సేవలు అందిస్తున్నారు.

సాయుధ దళాల పతాక దినోత్సవం
శత్రువుల నుండి దేశాన్ని రక్షిస్తూ విధి నిర్వహణలో భాగంగా వీర మరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరిస్తూ  ప్రతి సంవత్సరం డిసెంబర్​ 7న జరుపుకునేదే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే.  అమరవీరుల సైనికుల కుటుంబాల పట్ల సమాజం,  రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతతో విధిగా వ్యవహరించాలి. అప్పుడే తన కుటుంబ క్షేమం కోసం ఈ సమాజం,  ప్రభుత్వం ఉందని యువత సైన్యంలో చేరడానికి ఆసక్తి కనబరుస్తారు.  ప్రతి సంవత్సరం ఈ సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుక ద్వారా సమాజంలో సైనికుల పట్ల గౌరవం కలిగి యువత సైన్యంలో చేరడానికి ఆసక్తి కనబరుస్తారు. రాజకీయ లబ్ధిలో  భాగంగా ఆపరేషన్  సిందూర్ సంఘీభావ ర్యాలీలు నిర్వహించడం, ఎన్నికలలో ఓట్ల కోసం సైన్యాన్ని అవమానపరచడం తప్ప ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి సాయుధ దళాల పతాక దినోత్సవాలు రెండేళ్లుగా నిర్వహించింది లేదు.

కేసీఆర్ ఆర్మీ,  రేవంత్ రెడ్డి ఆర్మీ , అంటూ రాజకీయ పార్టీలలో సోషల్ మీడియాలలో  ప్రచార సైన్యమే తెలంగాణలో ఎక్కువ కనిపిస్తుంది తప్ప దేశ రక్షణలో  భాగమయ్యే ఆర్మీ మాత్రం కనుచూపుమేరలోనే ఉంటున్నది.  ఇప్పటికైనా  ప్రభుత్వం కళ్లు తెరిచి సైనిక సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి.  దేశ రక్షణలో  తెలంగాణను టాప్ 10లో నిలపాలని కోరుకుంటూ.. దేశానికి అన్నం పెట్టేవారు రైతులు అయితే దేశాన్ని రక్షించేవారు సైనికులు అని గుర్తించాలి.  జై జవాన్.  జై కిసాన్.

అగ్నివీరుల భవిష్యత్తుపై నీలినీడలు
 అగ్నిపథ్ పథకంలో భాగంగా నాలుగేళ్ల సర్వీస్ కాలంతో వందలో ప్రతిభ చూపించిన 25 శాతాన్ని మాత్రానే పర్మినెంట్ చేసి మిగతావారికి ఆర్థిక సహాయం అందించి వెనకకు పంపుతున్నారు.  బయటకు వచ్చిన అగ్నివీరులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించకపోవడం పెద్ద సమస్యగా మారింది. 

పారా మిలిటరీలో కేంద్ర హోం శాఖ పది శాతం రిజర్వేషన్లు, ఒకటి రెండు ఉత్తరాది బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే అగ్నివీరులకు పోలీస్ రిక్రూట్మెంట్ లలో  రిజర్వేషన్లు కల్పించాయి. ఈ మధ్యనే అగ్నివీరులను అవమానపరిచేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీలలో సెక్యూరిటీ గార్డులుగా చేర్చుకోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు వంటివి యువతను సైన్యంలో చేరడానికి వెనకకు లాగుతున్నాయి. యువత సైన్యంలో చేరడానికి ఆసక్తి కనబరచాలంటే  రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా 10% రిజర్వేషన్లు అన్ని ఉద్యోగాలలో కల్పించాలి. దేశం మొత్తం సైన్యంలో నాలుగేళ్లు అగ్నివీరులుగా చేసినవారికి ప్రభుత్వ ఉద్యోగం అని కఠినమైన నిబంధన తేవాలి.

బందెల సురేందర్ రెడ్డి