పాక్ న్యాయ వ్యవస్థలో.. ఓ భిన్నాభిప్రాయం ! రాజ్యాంగ పాత్ర కోల్పోయిన కోర్టు

పాక్ న్యాయ వ్యవస్థలో..  ఓ భిన్నాభిప్రాయం ! రాజ్యాంగ పాత్ర కోల్పోయిన కోర్టు

పాకిస్తాన్​ సుప్రీం కోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ అథర్​ మినల్లా, జస్టిస్​ సయ్యద్​ మన్సూర్​ అలీషాలు ఇటీవల అంటే నవంబర్​ 13న తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ తరువాత లాహోర్​ హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్  షామ్స్​మహమూద్​ మిర్జా  కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాలకు కేంద్ర బిందువు 27వ రాజ్యాంగ సవరణ. ఈ సవరణ ద్వారా పాకిస్తాన్​ సుప్రీంకోర్టు కంటే ఉన్నతమైన ఫెడరల్​ కానిస్టిట్యూషన్​ కోర్టుని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రత హరించిపోతుందని రాజ్యాంగ పాత్ర నిర్వీర్యం అవుతుందని న్యాయమూర్తులు బహిరంగ హెచ్చరికలు జారీచేశారు.

పాకిస్తాన్​ దేశం నిర్మాణాత్మక బలహీనతలను కలిగి ఉన్నది. అణచివేత చట్టాలు, అస్థిర వ్యవస్థ పాకిస్తాన్​లో ఉన్నాయి. ఇప్పుడు ఈ వివాదాస్పద రాజ్యాంగ మార్పుతో పాకిస్తాన్​  పరిస్థితి మరింత జటిలంగా మారిపోతుంది. ఈ కొత్త ఫెడరల్​ కోర్టు పరిధి విస్తృతమైనది.  ప్రభుత్వం, ప్రాథమిక హక్కులు అమలుకు సంబంధించిన రాజ్యాంగ వివాదాల పరిష్కార అధికార పరిధి ఫెడరల్​ కోర్టు కలిగి ఉంటుంది. 

సుప్రీంకోర్టు, ఇతర రాజ్యాంగ ధర్మాసనాలలోని కేసులు అన్నీ పెండింగ్​ పిటీషన్లు, అప్పీళ్లు అన్నీ ఫెడరల్​ కోర్టుకి బదిలీ అవుతాయి. సుప్రీంకోర్టు తనకు తానుగా (సుమోటో) విచారించే హక్కుని ఈ సవరణ రద్దు చేస్తుంది.  ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యాహ్యా అఫ్రిది తన పదవీకాలం ముగిసేవరకు ఆ పదవిలో కొనసాగుతారు.  అయితే  సుప్రీంకోర్టు ఆఫ్​ పాకిస్తాన్​ నుంచి  పాకిస్తాన్​ అన్నపదం ఉండదు. అంటే కోర్టు ఇక సుప్రీంకోర్టు ఆఫ్​ పాకిస్తాన్​గా ఉండదు. 

రాజ్యాంగ పాత్ర కోల్పోయిన కోర్టు
తాను పాకిస్తాన్​ అధ్యక్షుడికి పంపిన రాజీనామాలో జస్టిస్​ మినల్లా ఈ విధంగా పేర్కొన్నారు..‘తాను రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణం చేశాను.  కానీ, ఇప్పుడు రాజ్యాంగమే  లేకుండా పోయింది. నేను ధరించే వస్త్రాలు (రోబ్స్) కేవలం  అలంకారప్రాయంగా మారిపోతున్నాయి. అవి మనమీద ఉంచిన విశ్వాసానికి గుర్తుగా ఉండాలి. కానీ, అవి ద్రోహానికి చిహ్నాలుగా నిలిచిపోతున్నాయి. భవిష్యత్ తరాలు వాటిని భిన్నంగా చూడాలంటే నేను వీటిని వదిలిపెట్టాలి.  అందుకే ఈ దుస్తులను వేలాడదీసి తక్షణం అమల్లోకి వచ్చేవిధంగా రాజీనామా చేస్తున్నాను’. 

జస్టిస్​ షా కూడా తన 13 పేజీల రాజీనామా లేఖలో ఇలాంటి ఆందోళనలనే వ్యక్తపరిచారు. ఈ చర్యవల్ల అత్యున్నత న్యాయస్థానం ఐక్యత విచ్ఛిన్నం అయిందని, సుప్రీంకోర్టు  రాజ్యాంగ అధికార పరిధిని, న్యాయ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ పాత్రని కోల్పోయిన కోర్టులో కూర్చుని తన ప్రమాణాన్ని నిలబెట్టుకోలేనని ఆయన అన్నారు. కుదించిన కోర్టులో పనిచేస్తున్న నేను దాన్ని వికృతీకరించిన సవరణను న్యాయపరంగా కూడా పరిశీలించలేనని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

ఫెడరల్​ కోర్టు ఏర్పాటు తిరోగమనం
ఈ సవరణని వ్యతిరేకించడంలో విఫలమైన పాక్​ప్రధాన న్యాయమూర్తిని కూడా ఆయన విమర్శించారు. ఫెడరల్​ కోర్టు రాజ్యాంగ జ్ఞానం నుంచి ఉద్భవించలేదు.  రాజ్యాంగ ప్రయోజనం నుంచి ఉద్భవించిందని ఆయన వ్యాఖ్యానించారు. తనకు నాయకత్వం వహించడానికి అప్పగించిన సంస్థను సమర్థించడానికి బదులుగా ప్రధాన న్యాయమూర్తి దాని సవరణకు అంగీకరించారు. 

సుప్రీంకోర్టు రాజ్యాంగ స్థాయిని రద్దు చేస్తున్పప్పటికీ తన స్థానం కాపాడుకోవడానికి మాత్రమే ఆయన చర్చలు జరిపారని ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్​ షా విమర్శించారు. ఈ కొత్త ఫెడరల్​ కోర్టు ఏర్పాటు సంస్కరణ కాదు. ప్రమాదకరమైన తిరోగమనం. ఇది కోర్టుని కబళించే చర్య అని ఆయన విమర్శించారు. ఈ సవరణకు ఎలాంటి రాజ్యాంగ తర్కం లేదని, న్యాయశాస్త్ర పునాది లేదని ఆయన ఖండించారు. పాకిస్తాన్​ ప్రభుత్వం తనకు నచ్చిన రాజ్యాంగ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. తనముందు రెండు ఎంపికలు ఉన్నాయి. అవి సంస్థ పునాదిని దెబ్బతీసే ఏర్పాటులో భాగస్వామి కావడం, లేదా నిరసనగా తప్పుకోవడం. తాను రెండో ఎంపికను స్వీకరించాను అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

27వ రాజ్యాంగ సవరణతో సైనిక సంస్థలకు విపరీత అధికారాలు
ఈ 27వ రాజ్యాంగ సవరణ వల్ల సైనిక సంస్థలకు విపరీత అధికారాలు వస్తాయి. ప్రస్తుత ఫీల్డ్ మార్షల్​ ఆసీమ్​ మునీర్​కు ఎక్కువ అధికారాలను ఇస్తుంది. ఆయన ఇప్పుడు ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి రాజ్యాంగబద్ధంగా గుర్తింపు పొందిన అధిపతి. ఈ మార్పువల్ల జాయింట్​ చీఫ్స్​ ఆఫ్​ స్టాఫ్​ కమిటీని రద్దు చేస్తుంది. దాని స్థానం చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ ఫోర్సెస్​ అన్న కొత్త పదవి సృష్టించడం జరుగుతుంది. తన పదవీకాలం పూర్తయిన తరువాత కూడా సీడీఎఫ్​కి ప్రాసిక్యూషన్​ నుంచి చట్టపరమైన మినహాయింపు ఉంటుంది.

గతంలో ఈ ఇమ్యూనిటీ ఒక్క రాష్ట్ర అధిపతికి మాత్రమే ఉండేది. తన పదవి నుంచి వైదొలిగిన తరువాత కూడా జీవితకాలం ఈ ఇమ్యూనిటీ ఉంటుంది. ఆర్టికల్​ 243 సవరణ వల్ల ఫీల్డ్ మార్షల్,  అడ్మిరల్​ ఆఫ్​ ది ఫ్లీట్, మార్షల్​ ఆఫ్​ ది ఎయిర్​ఫోర్స్​ ర్యాంకులు కలిగిన అధికారులకు నేరారోపణల నుంచి, అరెస్టుల నుంచి జీవితకాలపు ఇమ్యూనిటీ లభిస్తుంది. అధ్యక్షుడికి, గవర్నర్​కి తమ పదవీకాలంలోనే ఈ ఇమ్యూనిటీస్ ఉండేవి. పదవీ విరమణ తరువాత అలాంటి రక్షణలు లేవు. ఈ షరతులు లేని రక్షణల వల్ల న్యాయంపొందే అవకాశం ఉండదు.  ఇది న్యాయసూత్రాలకు విరుద్ధం. నిరంకుశత్వం పెరిగే అవకాశం ఉంది. అధిపతులందరూ సమానం కాదన్న భావన కలుగుతుంది. 

సుప్రీంకోర్టు కన్నా ఉన్నతమైన ఫెడరల్ కానిస్టిట్యూషనల్​ కోర్టు
ఎఫ్​సీసీ అనేది సుప్రీంకోర్టు కన్నా ఉన్నతమైనది. దీనికి జస్టిస్ అమనుద్దీన్​ ఖాన్​ మొదటి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫెడరల్​ ప్రభుత్వాల మధ్య వివాదాలను ఈ కోర్టు పరిష్కరిస్తుంది. అంటే సుప్రీంకోర్టుకి రాజ్యాంగ కేసులని విచారించే అర్హత ఉండదు. రాజ్యాంగ వివాదాలు ఫెడరల్​ కోర్టు పరిధిలోకి వస్తాయి. పాకిస్తాన్​ న్యాయవ్యవస్థ ఇప్పుడు 27వ రాజ్యాంగ సవరణ వల్ల ఉత్పన్నమయ్యే నిరంకుశ వాతావరణంలో ఉన్నట్టు అనిపిస్తుంది. 

39వ రాజ్యాంగ సవరణ వల్ల మనదేశంలోని న్యాయవ్యవస్థ కూడా చిక్కుల్లో పడింది. ఈ రాజ్యాంగ సవరణ వల్ల ఆర్టికల్​ 329 ‘ఎ’ని చేర్చారు. దీని ప్రకారం రాష్ట్రపతి, ఉప రాష్ట్రప్రతి, ప్రధానమంత్రి, లోక్​సభ స్పీకర్​ ఎన్నికలు కోర్టు పరిధిలోకి రావు. అంతేకాదు 324  ‘ఎ’లోని క్లాజ్ కి గతానికి వర్తించేవిధంగా మార్పు చేశారు. అయితే, ఈ ఆర్టికల్​ని 44వ రాజ్యాంగ  సవరణ ద్వారా తొలగించారు. ఇదంతా ఎమర్జెన్సీ కాలంలో జరిగింది.

ఇప్పుడు ఎమర్జెన్సీ లేకున్నా కొన్ని న్యాయవ్యవస్థని ఆందోళనపరిచే సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం మారలేదు. ఎమర్జెన్సీ లేదు. కానీ, ఎగ్జిక్యూటివ్​ కోరిక మేరకు బదిలీలు జరుగుతున్నాయి. ఎలివేషన్స్​ కూడా అదేవిధంగా ఉన్నాయి. కేసుల కేటాయింపుల గురించి, కోర్టు నిర్వహణ గురించి సుప్రీంకోర్టు  న్యాయమూర్తులు నలుగురు ఊహించనివిధంగా పత్రికా సమావేశం నిర్వహించి ఆందోళనను వ్యక్తపరిచారు.

జనవరి 12, 2018న ఇది జరిగింది. ఇప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మన దేశంలో రాజ్యాంగం మారలేదు. సవరణలు అంతకంటే లేవు. కానీ, పరిస్థితులు మాత్రం అనుకున్నవిధంగా లేవు. దేశంగా పాకిస్థాన్​లో లోపాలు ఉన్నప్పటికీ,  న్యాయవ్యవస్థ..అది న్యాయమూర్తులు కావొచ్చు, న్యాయవాదులు కావొచ్చు.. నియంతృత్వం పోకడలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇటీవల రాజీనామాలు కూడా అలాంటి ధైర్యానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. 

డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)