తీరు మారని బీజేపీ.. స్థిరత్వం సాధించని బీఆర్ఎస్.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పార్టీల్లో అంతర్మథనం

తీరు మారని బీజేపీ.. స్థిరత్వం సాధించని బీఆర్ఎస్.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పార్టీల్లో అంతర్మథనం

రాజకీయాల్లో కొత్త విషయం లేనపుడు.. పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్​ ఎన్నికలైనా అధికార పార్టీలకు గెలుపులు పెద్ద కష్టం కావు. కాంగ్రెస్​ పార్టీ మున్సిపల్​ ఎన్నికల్లో ఈ స్థాయిలో గెలుపు సాధిస్తుందని పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక ప్రతిపక్షాలు కూడా ఊహించే ఉంటాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ  గుర్తులతో జరగలేదు. కాబట్టి, వాటి ఫలితాలను ఒక కొలమానంగా ఎవరూ భావించలేకపోయారు.

 ఇపుడు మున్సిపల్​ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగాయి కాబట్టి, పార్టీల పర్ఫామెన్స్​ను అంచనా వేసే అవకాశం ఉంది.  అధికార కాంగ్రెస్​ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓటు బ్యాంకును మున్సిపల్​ ఎన్నికల్లోనూ యథాతథంగా నిలుపుకుంది. ఇక బీఆర్​ఎస్​, బీజేపీ పార్టీల ఓటు బ్యాంకులలో ఎగుడు దిగుడు తేడాలొస్తున్నాయి. నిజానికి 2028 నాటికి కాంగ్రెస్​ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్​ఎస్​, బీజేపీలలో ఏది కానుందనేదే తెలంగాణ రాజకీయాల్లో కీలకాంశంగా మారింది. 

మున్సిపల్​ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బలపడలేదు కదా అని బీఆర్​ఎస్​ సంతోషపడి ఉండాలి!  బీఆర్​ఎస్​కు ఆ భయం లోక్​సభ ఎన్నికల తర్వాత  నుంచి బాగా పెరిగింది.  పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ భయాన్ని బీఆర్​ఎస్​ కొంత తుడిచేసుకోగలిగింది. కానీ అర్బన్​ ప్రాంతాల్లో బీజేపీ కాస్త బలంగానే ఉంటుంది కదా, అలాగే ప్రత్యామ్నాయ మంత్రంలో మునిగితేలుతున్న బీజేపీ మున్సిపల్​ ఎన్నికల్లో పుంజుకుంటుందేమో అనే భయం మాత్రం బీఆర్ఎస్​కు మొన్నటిదాకా వెంటాడింది. కానీ బీజేపీకి  పంచాయతీ ఎన్నికల లాగే, మున్సిపల్​ ఎన్నికల్లోనూ కనీసం ఒక్క మున్సిపాలిటీలోనైనా సొంత మెజారిటీ సాధించలేకపోవడం రాష్ట్రంలో ఆ పార్టీ దైన్యస్థితి ఏమీ మారలేదని చెపుతోంది. పార్టీ గుర్తులతో జరిగిన మున్సిపల్​ ఎన్నికలు నిజంగా మూడు పార్టీల బలాబలాలకు ఓ కొలమానంగా అందరూ భావించారు.

 కాంగ్రెస్​ అధికార పార్టీగా తన బలాన్ని చాటుకుంది. సీఎం రేవంత్​ రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలు మంచి మార్కులే సాధించుకున్నాయి. మిగిలింది బీఆర్​ఎస్​, బీజేపీలలో ఏది ప్రత్యామ్నాయం అనే చర్చ తెలంగాణలో చాలాకాలంగా నడుస్తున్నదే. అందుకు మున్సిపల్​ ఎన్నికలు ఒక కొలమానం కాకపోవచ్చు. కానీ బీజేపీ ఎదగలేకపోతున్నదనే విషయాన్ని మాత్రం మున్సిపల్​ ఎన్నికల ఫలితాలు చెపుతున్నాయి. బీజేపీకి  కరుడుగట్టిన కార్యకర్తల సంఖ్య పెరగొచ్చు. కానీ కచ్చితత్వ నాయకుల సంఖ్యనే ఆ పార్టీలో పెరగడంలేదు, అలాగే ఉన్న నాయకులలోనూ తాము ఎదగాలనే కసి కనిపించడం లేదు, బండి, ధర్మపురి, పాయల్​ లాంటి వారిలో తప్ప! 

స్థిరత్వం సాధించని బీజేపీ, బీఆర్​ఎస్​

లోక్​సభ ఎన్నికల్లో 16శాతం ఓట్లకు పడిపోయిన బీఆర్ఎస్​కు పంచాయతీ ఎన్నికలు కొంత ఊరటనిచ్చాయి. ఇపుడు మున్సిపల్​ ఎన్నికల్లో ఆ ఆపార్టీ ఎన్ని మున్సిపాలిటీలు గెలిచింది అనేకన్నా, లోక్​సభ ఎన్నికల్లో సాధించిన 16శాతం ఓట్ల కంటే ఎంత శాతం ఓట్లను అధికంగా సాధించింది అని చూడాలి. సుమారు 12 శాతం  అధికంగా సాధించింది. లోక్​సభ ఎన్నికల్లో 35శాతం ఓట్లు సాధించిన బీజేపీ, మున్పిపల్​ ఎన్నికల్లో 15 శాతం ఓట్లకు పడిపోయింది అంటే, సుమారు 20 శాతం ఓట్లను కోల్పోయింది. బీఆర్​ఎస్​, బీజేపీల ఓట్ల శాతంలో రెండేండ్లలో తేడాలు వచ్చినా, కాంగ్రెస్​ పార్టీ ఓట్ల శాతంలో మాత్రం తేడా రాకపోవడం గమనార్హం. అంటే, తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్​ పార్టీ తన రాజకీయ స్థిరత్వాన్ని చాటుకుంటున్నపుడు, మూడేండ్ల తర్వాత బీఆర్​ఎస్​, బీజేపీలలో ఏది ప్రత్యామ్నాయంగా  నిలబడుతుందంటే ఇప్పటికీ సందిగ్ధంగానే ఉందని చెప్పాలి. 

అసెంబ్లీ ఎన్నికల్లో 37శాతం, లోక్​సభ ఎన్నికల్లో 16శాతం,  మున్సిపల్​  ఎన్నికల్లో 28శాతం సాధించిన బీఆర్​ఎస్​  రాజకీయ స్థిరత్వం మాత్రం ఇప్పటికీ ప్రమాదంలోనే ఉందని చెప్పాలి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 14శాతం, లోక్​సభ ఎన్నికల్లో 35శాతం, మున్సిపల్​ ఎన్నికల్లో 15శాతం సాధించిన బీజేపీ కూడా  తెలంగాణలో  రాజకీయ స్థిరత్వం సాధించలేకపోతున్నది. బీఆర్​ఎస్​, బీజేపీల అస్థిరత్వాలు పరోక్షంగా కాంగ్రెస్​ పార్టీని  తెలంగాణలో మరింత బలోపేతం చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. అందుకేనేమో, పదేండ్లు  నేనే  సీఎంగా ఉంటానని రేవంత్​ రెడ్డి చెప్పగలుగుతున్నారు!

బీజేపీ తీరు  బీఆర్​ఎస్​కు కలిసొస్తుందా?

2024 లోక్​సభ ఎన్నికల్లో 35శాతం ఓట్లు సాధించడంతో  తెలంగాణలో  బీజేపీ ఎదుగుదలకు అదొక పెద్ద మలుపుగా రాజకీయ పండితులు భావించారు. లోక్​సభ ఎన్నికల్లో  మోదీ  చరిష్మా పనిచేసింది. ఇపుడు పంచాయతీల్లో, మున్సిపల్​ ఎన్నికల్లో  కూడా మోదీ చరిష్మానే పనిచేయదు కదా! రాష్ట్ర నాయకత్వం బలంగా ఉంటే కదా ఫలితాలు సాధించేది! స్థానిక నాయకత్వ కొరత, ఎంపీలు ఎవరికివారే తీరుతో.. లోక్​సభ ఎన్నికల్లో  తెచ్చుకున్న ఓటుశాతాన్ని బీజేపీ ఏమాత్రం నిలబెట్టుకోలేకపోతున్నది. 

లోక్​సభ ఓటు శాతాన్ని  బీజేపీ రిపీట్​ చేయలేకపోయినా.. మున్సిపల్​ ఎన్నికల్లో  కనీసం 20శాతం ఓట్లైనా సాధించి ఉంటే.. బీఆర్​ఎస్​ను రాజకీయంగా కార్నర్​​ చేయగలిగే అవకాశం ఉండేది! రాష్ట్ర నాయకత్వ కొరత పుణ్యమా  అని రోజురోజుకూ  బలహీనపడుతున్న బీజేపీ తీరు.. ఖచ్చితంగా బీఆర్​ఎస్​కు సంబరపరిచే అంశమే! వాస్తవానికి ప్రజలు బీఆర్​ఎస్​ను కావాలని కోరుకుంటున్నది లేదు. మున్సిపల్​ ఎన్నికల్లో మరో ప్రత్యామ్నాయం లేక  బీఆర్​ఎస్ కు ప్రజలు​  రెండో స్థానం ఇచ్చారు. అది తెలంగాణలో బీజేపీ  వైఫల్య రాజకీయాల పుణ్య ం మాత్రమే!

బీఆర్​ఎస్ కు ​ నైతికత లేమి,  బీజేపీకి దుర్భలత!​

వాస్తవానికి గత రెండేండ్లుగా బీఆర్​ఎస్​ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వాన్ని ఏ విషయంలోనూ ప్రశ్నించినా, అది నైతికంగా నిలబడలేకపోతున్నది. కేసీఆర్​ పదేండ్ల పాలన కేసీఆర్​నే ప్రశ్నిస్తోంది. ఇక బీఆర్​ఎస్​ రేవంత్​ ప్రభుత్వాన్ని  ఏమని ప్రశ్నించగలుగుతోంది? అది ఏమేరకు నిలబడుతోంది? తమ పాలనలో జరిగిన తప్పిదాలపైనే, తిరిగి రేవంత్​ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి! ప్రశ్నించే నైతికత లేని బీఆర్​ఎస్​ నిజానికి ప్రతిపక్షంగా రాణించలేకపోతున్న పరిస్థితి ఉండగా..  అంది వచ్చిన ఆ పరిస్థితిని సైతం బీజేపీ అందుకోలేకపోతున్న దుస్థితి చూస్తే, తెలంగాణలో ఆ పార్టీ బీఆర్​ఎస్​ను ఏ మేరకు రీప్లేస్​  చేయగలుగుతుంది? అలాంటి బీజేపీ దుర్భలత వల్లనే కదా మున్సిపల్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ మళ్లీ రెండో స్థానంలో నిలబడగలిగింది! 

సమస్యల్లో బీఆర్​ఎస్​, అయినా బీజేపీ బలహీన ప్రదర్శన!

బీఆర్ఎస్​ యజమానులు అనేక దర్యాప్తులు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్​ కుటుంబ రాజకీయాలతో సతమతమవుతున్నారు. నిజానికి  కవిత చేస్తున్న విమర్శలను బీఆర్​ఎస్​ తట్టుకోలేకపోతున్నది. తిరిగి జవాబులు ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదు. ఓవైపు కుటుంబ కలహాలు, మరోవైపు ప్రభుత్వాన్ని ఏ విషయంలో నిలదీసినా నైతికత లేకుండా పోవడం, ఇంకోవైపు తమపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రేవంత్ ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తులు.. వెరసి బీఆర్​ఎస్​ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో..బీజేపీ నుంచి ఇంత బలహీన ప్రదర్శనను నిజంగా ఎవరూ ఊహించి ఉండరు! 

నిజానికి, తెలంగాణలో బీజేపీ బలపడింది బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగానే. దేశ రాజకీయాలు ఎలా ఉన్నా, తెలంగాణ రాజకీయాలు అందుకు భిన్నం అని బీజేపీ ఢిల్లీ నేతలు గ్రహించలేకపోతున్నారు. బీఆర్​ఎస్​ను బతికిస్తూ బీజేపీ బలపడడమనేది తెలంగాణలో ఎన్నటికీ సాధ్యం కానిపని. ఈ విషయాన్ని ఢిల్లీ బీజేపీ అగ్ర నేతలు ఏమేరకు గమనిస్తున్నారు అనేదానిపైనే తెలంగాణలో బీజేపీ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది! 

నిక్కచ్చితనం కొరవడింది

తెలంగాణలో నిక్కచ్చి రాజకీయం చేయడంలో ఇప్పటికైతే బీజేపీ విఫలమైందనే చెప్పాలి. బరిగీసి రాజకీయం చేస్తేగానీ ఏ పార్టీ అయినా ప్రత్యామ్నాయంగా ఎదిగిరాదు. ఎందుకోగానీ, ప్రధాని మోదీ తెలంగాణ రాజకీయాలతో ఎప్పుడూ దోబూచులాడుతూ వస్తున్నారు తప్ప, నిక్కచ్చితనం కనిపిస్తున్నది లేదు.  రాష్ట్రానికి ఒక బలమైన నాయకుడిని పెట్టడంలో ఆయన ఇష్టపడుతున్నట్లులేదు. అది పరోక్షంగా బీఆర్​ఎస్​కు ఉపయోగపడే రాజకీయం తప్ప,  బీజేపీని ఎదిగించే రాజకీయం మాత్రం కాదు. తెలంగాణ రాజకీయాల పట్ల మోదీలో మార్పు లేనంత కాలం బీజేపీ తెలంగాణలో  కనిష్టంగా మూడో స్థానంలో బతికే పార్టీగానే ఉంటది తప్ప ఎదిగే పార్టీగా ఉండటం కష్టమే! 

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి
సీనియర్​ జర్నలిస్ట్​

NOTE : ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ: openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.