రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..    బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు అమలుచేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హస్తినాపురం నుంచి బీఎన్ రెడ్డి వరకు స్టూడెంట్స్​తో కలిసి బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రిజర్వేషన్లు కల్పిస్తామని రెండేళ్లుగా ఊరించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు పాత జీవో ప్రకారం 22 శాతం అమలు చేస్తామని కేబినెట్​లో నిర్ణయించడం అన్యాయమన్నారు. రిజర్వేషన్ల కేసు హైకోర్టులో నడుస్తుండగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడానికి ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం  ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. 

కాంగ్రెస్ ఎంపీలు బీసీల రిజర్వేషన్లపై  పార్లమెంటులో ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. మార్చి లోపు ఎన్నికలు పూర్తి చేయకపోతే రూ.3 వేల కోట్లు వృథా అవుతాయని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

 ఆర్టికల్ 243 డీ6 ప్రకారం స్థానిక సంస్థల్లోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, దాని  ప్రకారం చట్టం చేయాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నీల వెంకటేశ్, పగిళ్ల సతీశ్, అనంతయ్య, రాజేందర్, శివయాదవ్, రాజ్ కుమార్, అజయ్, అంజి గౌడ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.