- సందర్శన కోసం విడుదల చేసిన అటవీ శాఖ అధికారులు
- తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విరాళంగా ఇచ్చిన దాత రామ్‌జీ
హైదరాబాద్, వెలుగు: పర్యాటకులకు కనువిందు చేసేందుకు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు రెండు హంసలు వచ్చాయి. బుధవారం జూలోని ఎన్‌క్లోజర్‌లోకి హంసల జంటను అటవీశాఖ పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్ మేరు విడుదల చేశారు. పర్యాటకుల సందర్శన కోసం వీటిని అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. 199 రకాల జీవ జాతులతో దేశంలోనే నెహ్రూ జూపార్క్ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. సందర్శకుల కోసం కొత్త రకాల జంతువులను తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం జూలో 199 రకాల ప్రజాతులు ఉన్నాయని, మొత్తంగా 2 వేలకు పైగా జంతువులు ఉన్నాయని తెలిపారు.
కాగా, ఈ హంసల జంటను ప్రముఖ జంతు ప్రేమికుడు ఎన్ఎస్ రామ్‌జీ జూపార్క్‌కు విరాళంగా అందజేశారు. రామ్‌జీ ఆయన తల్లిదండ్రులు నారాయణస్వామి (రిటైర్డ్ ఐపీఎస్) దంపతుల జ్ఞాపకార్థం వీటిని విరాళం ఇచ్చారు. 2010 నుంచి ఆయన జంతువులను దత్తత తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జూ పార్క్ డైరెక్టర్ డా.సునీల్ హిరేమత్, క్యూరేటర్ జె.వసంత, డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ) ఎంఏ హకీం, డిప్యూటీ క్యూరేటర్ బర్నోబా, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారులు బీకే. సింగ్, జయప్రసాద్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
