బ్యాంకర్లు రుణ లక్ష్యాలను సాధించాలి : మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

బ్యాంకర్లు రుణ లక్ష్యాలను సాధించాలి :  మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: బ్యాంకర్లు రుణ లక్ష్యాలను చేరుకోవాలని మహబూబాబాద్​ కలెక్టర్​ అద్వైత్​కుమార్​ సింగ్​ కోరారు. బుధవారం కలెక్టరేట్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు క్రాప్​ లోన్స్  43.91శాతం, అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ 57.96శాతం, స్వయం సహాయక సంఘాల రుణాలు 47.99 శాతం లక్ష్యాలను, పీఎం స్వనిధి 99.53 శాతం పూర్తి చేశారన్నారు. పూర్తిస్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని కోరారు. వ్యవసాయశాఖతో పాటు పశు సంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలన్నారు. 

వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలతోపాటు స్టాండ్ ఆఫ్​ఇండియా కింద రుణాలను అందించాలన్నారు. హార్టికల్చర్ విభాగానికి చెందిన రుణాలను త్వరగా రైతులకు అందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికా ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ కె.అనిల్ కుమార్, ఆర్బీఐ ఎల్డీవో డిబోజిత్ బారువ, డీఆర్డీఏ పీడీ మధుసూదన రాజు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్  యాదగిరి, నాబార్డు ఏజీఎం చైతన్య రవి, డీఏవో విజయనిర్మల, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.