గిల్‌‌‌‌‌‌‌‌పై అదే సస్పెన్స్‌‌‌‌‌‌‌‌... ! పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ లేని ఇండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌.. రెండో టెస్టు ఆడాలని ఆశిస్తున్న శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌

గిల్‌‌‌‌‌‌‌‌పై అదే సస్పెన్స్‌‌‌‌‌‌‌‌... ! పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ లేని ఇండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌.. రెండో టెస్టు ఆడాలని ఆశిస్తున్న శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌

గువాహతి: మెడ గాయం కారణంగా తొలి టెస్టు మధ్యలోనే వైదొలిగిన టీమిండియా కెప్టెన్ శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్.. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో బరిలోకి దిగే విషయంపై సస్పెన్స్ నెలకొంది. మెడకు ఎలాంటి పట్టీ లేకుండా బుధవారం జట్టుతో కలిసి గువాహతి చేరుకున్నప్పటికీ అతని గాయం ఇంకా పూర్తిగా నయం కాలేదని సమాచారం. నొప్పి తీవ్రత తగ్గినా తను వంద శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌గా లేడని జట్టు వర్గాలు తెలిపాయి. అయితే, శనివారం నుంచి జరిగే రెండో టెస్టు సమయానికి ఎలాగైనా ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సాధించి బరిలోకి దిగాలని గిల్ పట్టుదలగా ఉన్నాడు. గురు, శుక్రవారాల్లో జరిగే ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొని తన ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను నిరూపించుకోవడానికి గిల్ ప్రయత్నించనున్నాడు. దీనిపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. ‘గిల్ వైద్య చికిత్సకు బాగా స్పందిస్తున్నాడు. మా మెడికల్ టీమ్ అతన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. రెండో టెస్టులో తను ఆడే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం’ అని ప్రకటించారు. 

కెప్టెన్ లేకుంటే కష్టమే..

కోల్‌‌‌‌‌‌‌‌కతా టెస్టులో సఫారీ ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ ఇండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. దీంతో అతన్ని  ఎదుర్కోవడానికి ఒక నాణ్యమైన రైట్ హ్యాండ్ బ్యాటర్ జట్టుకు అవసరం. గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌‌‌‌‌లో ఒకరిని ఆడించే అవకాశం ఉన్నా కోచింగ్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌, సెలెక్టర్లు వారి వైపు మొగ్గు చూపడం లేదు. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ లెఫ్టాండ్ బ్యాటర్లు కావడంతో స్పిన్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడం సవాలుగా మారుతోంది.  సుదర్శన్ ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేకపోవడంతో, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌‌‌‌‌‌‌‌ను మూడో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడించే ఆలోచనలో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. 

రిస్క్ తీసుకుంటారా?

కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఇప్పుడిప్పుడే జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్న గిల్  ఈ దశలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు దూరం కావడం ఇష్టపడటం లేదు. అందుకే సగం ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో ఉన్నా సరే ఆడాలని భావిస్తున్నాడు. గిల్ సగం ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడినా.. కుర్రాల్ల కంటే  ఎక్కువ ప్రభావం చూపగలడు. అలాగని రిస్క్ చేసి టెస్టు ఆడితే గాయం పెద్దదయ్యే ప్రమాదం ఉంది. గిల్ పూర్తిగా కోలుకోవడానికి 10 రోజులు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. ఇప్పుడు రిస్క్ చేస్తే  ఈ నెల 30 నుంచి రాంచీలో జరిగే వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో సెలెక్టర్లు అతనికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం రావొచ్చు. 

కానీ, ఇప్పటికే వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంతో ఉన్నాడు. ఇప్పుడు గిల్ కూడా టెస్టు ఆడి వన్డేలకు దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్‌‌‌‌‌‌‌‌కు అప్పగించాల్సి వస్తుంది.  ఏదేమైనా రాబోయే 4 వారాల్లో ఒక టెస్టు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడటం గిల్‌‌‌‌‌‌‌‌కు సాధ్యం కాకపోవచ్చు.  కాబట్టి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి విశ్రాంతి ఇవ్వడమే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యాతో పాటు వర్క్‌‌‌‌లోడ్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో భాగంగా పేసర్ బుమ్రా  సఫారీలతో వన్డే సిరీస్‌‌‌‌ ఆడకుండా రెస్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.