- ఏడాది రెంట్ చదరపు అడుగుకి రూ.19,600..
- పెరుగుతున్న రద్దీతో అద్దెలు పైపైకి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ 24 వ ప్లేస్ దక్కించుకుంది. కానీ, కిందటేడాదితో పోలిస్తే ఒక ర్యాంక్ పడిపోయింది. రియల్టీ కన్సల్టెన్సీ కంపెనీ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిపోర్ట్ ప్రకారం, ఖాన్ మార్కెట్‌లో ఒక చదరపు అడుగు రెంట్ ఏడాదికి 223 డాలర్ల (రూ.19,600) కు పెరిగింది. ఇండియాలో అత్యంత ఖరీదైన రిటైల్ ఏరియాగా నిలిచింది. ఈ లిస్ట్‌లో లండన్‌లోని న్యూ బాండ్ స్ట్రీట్ నెంబర్ వన్ ప్లేస్ దక్కించుకుంది.
ఇక్కడ చదరపు అడుగు రెంట్ ఏడాదికి 2,231 డాలర్లు (రూ.1,96,000). కిందటేడాది టాప్ పొజిషన్‌లో ఉన్న మిలాన్ (ఇటలీ )లోని వయా మాంటే నెపోలియన్ ఏరియా, ఈ ఏడాది లిస్ట్‌లో సెకెండ్ ప్లేస్‌కు జారుకుంది. ఇక్కడ చదరపు అడుగు ఏడాది రెంట్ విలువ 2,179 డాలర్ల (రూ.1,91,000) కు పెరిగింది. న్యూయార్క్‌లోని అప్పర్ ఫిఫ్త్ అవెన్యూ 2 వేల డాలర్ల (రూ.1,76,000) రెంట్‌తో మూడో ప్లేస్‌లో ఉంది. కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ప్రపంచంలోని 138 బెస్ట్ అర్బన్ రిటైల్ లొకేషన్లను పరిశీలించి తాజా లిస్ట్‌ను విడుదల చేసింది. హాంగ్‌కాంగ్‌లోని ట్సిమ్ షా త్సుయి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.
దీని తరువాత స్థానాల్లో అవెన్యూ డెస్ షాంప్స్-ఎలీసెస్ (పారిస్), గింజా (టోక్యో), బాన్‌హోఫ్‌స్ట్రాస్సే (జ్యూరిచ్), పిట్ స్ట్రీట్ మాల్ (సిడ్నీ), మియాంగ్‌డాంగ్ (సియోల్), కోల్‌మార్క్ట్ (వియన్నా) ఉన్నాయి. ‘‘ఇండియాలోని హై స్ట్రీట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. గ్లోబల్‌గా పాపులర్ అవుతున్నాయి. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్, కనాట్ ప్లేస్, గలేరియా మార్కెట్ వంటివి ఇంటర్నేషనల్, డొమెస్టిక్ బ్రాండ్లను ఆకర్షిస్తున్నాయి” అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సరాఫ్ అన్నారు.
ఈ ఏరియాల్లో షాపింగ్ మాల్స్ లిమిటెడ్‌గా ఉన్నా, రిటైలర్లకు స్ట్రాటజిక్‌గా హబ్‌గా మారాయని తెలిపారు. కాగా, గురుగ్రామ్‌లోని గలేరియా మార్కెట్ అద్దె ధరలు గత ఏడాది కాలంలో 25శాతం పెరిగాయి. దీని తరువాత కనాట్ ప్లేస్ (న్యూఢిల్లీ)లో 14శాతం పెరుగుదల, కెంప్స్ కార్నర్ (ముంబై)లో 10శాతం పెరుగుదల నమోదైంది. రిటైల్ డిమాండ్, ప్రైమ్ లొకేషన్లలో రద్దీ, వినియోగదారుల ఖర్చులు పెరగడం వల్ల ఈ ఏరియాల్లో రెంట్లు భారీగా పెరుగుతున్నాయి.
