కార్తీకమాసం నవంబర్ 20 వ తేదీతో ముగిసింది. రేపటి నుంచి ( 2025 నవంబర్ 21) మార్గశిరమాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసం తొలిరోజు ను పోలి పాడ్యమి అంటారు. ఈ రోజు అమ్మవారికి.. శివ.. కేశవులకు ఎంతో ఇష్టమైన రోజని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏడాది ( 2025) పోలి స్వర్గం.. పోలి పాడ్యమి శుక్రవారం వచ్చింది.
పురాణాల ప్రకారం ఈ రోజున ( నవంబర్ 21) వ తేదీన మహిళలు 30 ఒత్తులతో ఆవునెయ్యి తో అరటి దొప్పల్లో దీపారాధన చేసి నదుల్లో వదిలితే ఇబ్బందులు తొలగి మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. అరటి దొప్పల దీపాలను నీటిలో వదిలి మూడుసార్లు ముందుకు నెట్టాలి. . ఇలా చేస్తే కుటుంబంలో దారిద్ర్యం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.
పోలి పాడ్యమి రోజున ( నవంబర్ 21) నిష్ఠతో దీపారాధన చేసి, పోలి స్వర్గం కథను శ్రద్ధగా వింటే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఒక్క రోజు పూజతో కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. స్వర్గప్రాప్తి మార్గం సుగమం అవుతుంది. మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి. కుటుంబంలో సౌఖ్యం, సమృద్ధి పెరిగి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.
ఎలా పూజ చేయాలి
తెల్లవారు జామునే బ్రహ్మ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీస్నానానికి వెళ్లాలి. స్నానం చేసిన తరువాత శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని.. అరటి దొప్పల్లో 30 ఒత్తులతో దీపారాధన చేసి నదుల్లో వదలాలి.నదీతీరానికి వెళ్లే అవకాశం లేనివారు ఇంట్లో తులసి కోట దగ్గర దీపారాధన కుందిలో గాని.. ప్రమిదలో గాని దీపారాధన చేయాలి. తులసి కోట ఎదురుగా వెడల్పాటి .. లోతైన పాత్రలో నీళ్లను పోసి ఉంచాలి. ఆ నీళ్లలో గంగా జలం ఉంటే కలపాలి. ఆ తరువాత ఆ నీళ్లలో పసుపు.. కుంకుమ గంధం వేసి జీవనదులను ఆవాహన చేయాలి. ఆ పాత్రకు ఒక పసుపుకొమ్మును కట్టాలి. ఆ తరువాత అరటి దొప్పల్లో 30 ఒత్తులతో దీపారాధన చేసి ఆ పాత్రలో వదలాలి. అలా చేసిన కాని నదుల్లో వదిలిన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
పోలి పాడ్యమి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి, అరటి దొప్పలలో 30 వత్తులు వేసి దీపాలను వెలిగించాలి.వీటిని నీటిలో వదలడం వలన పాపాలు తొలగిపోతాయి. వదలిన తర్వాత మూడు సార్లు నీటిని తోసి నమస్కారం చేయాలి. పోలి స్వర్గం పూజా విధానంలో ఇది చాలా ముఖ్యమైనది.పోలి పాడ్యమి నాడు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు.
దీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం ఇదే..!
శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపదః,
శత్రు బుద్ధి వినాశాయ, దీప జ్యోతి నమోస్తుతే" అనే మంత్రాన్ని చదవాలి
“ఓం నమశ్శివాయ” అనే మంత్రాన్ని జపించినా చాలా మంచి ఫలితం ఉంటుంది.
పోలి పాడ్యమి నాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి. పోలి పాడ్యమి నాడు పోలి స్వర్గం కథ విన్నా, చదివినా శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
