ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన ఒక పేద కుమ్మరి జీవితం రాత్రికి రాత్రి తలకిందులైంది. రెండు రూపాయలకు మట్టి పాత్రలు అమ్ముకుంటూ జీవనం సాగించే మహమ్మద్ సయీద్ అనే వ్యక్తికి ఏకంగా రూ.కోటి 25లక్షలు కట్టాలంటూ జీఎస్టీ నోటీసు రావడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అసలు వ్యాపారమే తెలియని ఒక సామాన్యుడికి కోట్లలో పన్ను నోటీసు రావడం వెనుక ఒక భారీ మోసం దాగి ఉందని తేలింది.
హర్చంద్‌పూర్ ప్రాంతంలో నివసించే సయీద్ ఐదుగురు సభ్యులున్న తన కుటుంబాన్ని పోషించడానికి మట్టి పాత్రలు తయారు చేస్తూ కష్టపడుతుంటాడు. అయితే ఇటీవల ఆయనకు అందిన ప్రభుత్వ నోటీసులో అతని పేరు మీద పాట్నాలో ఏకంగా నాలుగు కంపెనీలు నడుస్తున్నట్లు.. వాటికి సంబంధించి రూ.1.25 కోట్లకు పైగా పన్ను బకాయి ఉన్నట్లు ఉంది. ఈ విషయం తెలుసుకున్న సయీద్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తనకు అసలు కంపెనీలు పెట్టేంత స్తోమత లేదని, ఎవరో తన గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు కథ ఏమిటంటే.. కొన్ని ఏళ్ల క్రితం బ్యాంకు లోన్ తీసుకునేందుకు ఓ గ్రామస్థుడు సయీద్‌కు సాయం చేస్తానని నమ్మబలికాడు. అందుకోసం సయీద్ ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు తీసుకున్నాడు. అయితే అనుకున్నట్లుగా అప్పు రాలేదు సరే కదా.. కొద్దిరోజుల తర్వాత సయీద్ తన ఒరిజినల్ డాక్యుమెంట్లను కూడా పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న డాక్యుమెంట్లను కేటుగాళ్లు ఆసరాగా చేసుకుని.. సయీద్‌కు తెలియకుండానే ఆయన పేరుతో నకిలీ కంపెనీలు సృష్టించి కోట్లలో లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది.
నిజానికి మొదటి జీఎస్టీ నోటీసు ఆరు నెలల క్రితమే వచ్చింది. కానీ ఆ కుటుంబం చదువుకోకపోవడంతో దాని తీవ్రతను గుర్తించలేకపోయారు. ఫిబ్రవరి 15న రెండో నోటీసు వచ్చినప్పుడు వేరేవాళ్ల సహాయంతో దానిని చదివించగా, అందులో ఉన్న కోట్లలో టాక్స్ డిమాండ్ చూసి సయీద్ కుటుంబం కుప్పకూలిపోయింది. మేము ఏవైనా తప్పులు చేసి ఉంటే నేరస్థుల్లా శిక్షించండి.. కానీ నిరపరాధులమైతే మాకు న్యాయం చేయండి అంటూ సయీద్ అధికారులను వేడుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాన్ని ఆశ్రయించి దర్యాప్తు కోరుతున్నారు. ఈ ఘటన డిజిటల్ ప్రపంచంలో సామాన్యుల గుర్తింపు కార్డులు ఎంత ప్రమాదకరంగా దుర్వినియోగానికి గురవుతున్నాయో కళ్లకు కట్టినట్లు చెబుతోంది.
