హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టులో వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. కోర్టుకు హాజరైన వైఎస్ జగన్ కోర్టు హాల్లో 5 నిమిషాలు కూర్చున్నారు. జగన్ హాజరైనట్టు సీబీఐ కోర్టు రికార్డులో నమోదు చేసింది. దీంతో.. అక్కడ నుంచి జగన్ లోటస్ పాండ్లోని తన నివాసానికి బయల్దేరి వెళ్లారు.
మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు లోటస్ పాండ్ నివాసం నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట నుంచి బెంగళూరులోని కెంపె గౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు జగన్ బెంగళూరుకు చేరుకుంటారు.
మాజీ సీఎం జగన్ కోర్టు అనుమతితో ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చారు. జగన్ అభిమానులు భారీగా చేరుకుని బేగంపేట ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కార్యకర్తల నినాదాలతో బేగంపేట విమానాశ్రయ ప్రాంగణం మార్మోగింది. సీఎం సీఎం అంటూ.. వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎయిర్ పోర్ట్ బయట కార్యకర్తలను ఆపివేయడంతో పోలీసులను తప్పించుకొని మరీ ఎయిపోర్ట్లోకి వైసీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు.
