రాష్ట్రంలోనే మూడో అతి పెద్ద నగరమైన ఇందూరు హస్తగతం కానుంది. నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నియమావళి ప్రకారం కాంగ్రెస్, ఎంఐఎం కలిపి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్లుండి మధ్యాహ్నం మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.
కరీంనగర్ బీజేపీకి పట్టం కట్టగా.. నిజామాబాద్ రెండు స్థానాల్లో వెనుకబడిన కారణంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోలేక పోతోంది. మొత్తం 28 కార్పొ రేటర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. నగర పరిధిలో ఓటు హక్కు ఉన్న రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు మాత్రమే ఎక్స్ అఫిషియో సభ్యులుగా అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాకు మాత్రమే ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది.
వారిద్దరినీ కలుపుకొంటే బీజేపీకి 30 ఓట్లు వస్తాయి. ఈ ప్రాంతం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న అంజిరెడ్డికి, టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న మల్క కొమురయ్యకు నిజామాబాద్ నగరంలో ఓటు హక్కు లేదు. దీంతో వారు ఎక్స్ అఫీషియో సభ్యులగా ఓటు హక్కు వినియోగించుకొనే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ 17, మజ్లిస్ 14 సీట్లలో గెలుపొందింది. అంటే మొత్తం 31 సీట్లు, 60 సీట్లున్న ఈ కార్పొరేషన్లో 31 సీట్ల స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశం కనిపిస్తోంది. ఎలాంటి ఎక్స్ అఫీషియో సభ్యుల సపోర్టు లేకుండానే ఇందూరుపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడే అవకాశం ఉంది.
