మార్చిలో కాజీపేట రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్‍ పనులు ప్రారంభం

 మార్చిలో కాజీపేట రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్‍ పనులు ప్రారంభం

వరంగల్‍, వెలుగు: కాజీపేటలో వచ్చే మార్చిలో రైల్వే కోచ్​ మ్యానుఫ్యాక్చరింగ్‍ పనులు ప్రారంభించనున్నట్లు వరంగల్‍ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్‍ నాగరాజు తెలిపారు. 30 ఏండ్ల ఓరుగల్లువాసుల కల నెరవేరబోతోందన్నారు. బుధవారం ఇరువురు కాజీపేటలోని రైల్వే కోచ్‍ ఫ్యాక్టరీ పనులు ఏ స్థాయికి వచ్చాయో పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైల్వే కోచ్‍ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన బాధితులతో పాటు, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‍ చేశారు. గతంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు.

 ఇదే అంశంపై వచ్చే పార్లమెంట్‍లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఏటా 600 కోచ్‍లను తయారుచేసే ఫ్యాక్టరీ ప్రారంభ పనులను జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూములు కోల్పోయినవారు ఉద్యోగాల కోసం ఆందోళన చెందకూడదని, తాను, ఎంపీ కడియం కావ్య స్థానిక ప్రజాప్రతినిధులుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో రైల్వే సీఎంఈ ఆనంద్‍, జీజీఎం మురళీకృష్ణ, డీజీఎం శర్మ పాల్గొన్నారు.