ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.. ప్రభుత్వం ముఖ్యంగా మహిళల కోసం అమలు చేస్తున్నది ఈ పథకం. ఇది సామాజిక సాధికారత, ఆర్థిక చలనశీలతను పెంచడానికి ఒక ముఖ్యమైన చర్యగా గుర్తించడమైనది. అయితే, ఈ పథకం అమలులో సానుకూల అంశాలతోపాటు పలు సవాళ్లు, విమర్శలు కూడా ఉన్నాయి. ఈ పథకం లాభనష్టాలు, సామాజిక పరిణామాలు, పౌర సమాజం బాధ్యతపై విశ్లేషణ ఇది. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించి, వారి చలనశీలతను గణనీయంగా పెంచింది.
ఇది ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి, విద్యా సంస్థలకు వెళ్లడానికి, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడానికి సహాయపడింది. అయితే, కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి. ఉదాహరణకు కొన్ని చోట్ల బస్సుల్లో వివాదాలు లేదా అరకిలోమీటర్ లోపు బస్సు ఎక్కి దిగడం వంటి సంఘటనలు నమోదయ్యాయి. అంతేకాక, అతి ముఖ్యమైనది బస్సుల సంఖ్యను పెంచాల్సిన చోట తగ్గించడం వల్ల స్థలం లేకపోవడం, గొడవలకు దారితీస్తోంది. ఈ సమస్యలు సౌకర్యం సమర్థవంతమైన అమలుపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
గ్రామీణ, చిన్నతరహా, మధ్యతరహా పట్టణ సమాజంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉంది. మహిళలు, పురుషులు తమ కుటుంబం కోసంగానీ, మెరుగైన జీవనం కోసం మహానగరాలకు వలస వెళ్తున్నారు. అయితే, అక్కడ వారు తరచుగా తక్కువ వేతనంతో కూడిన కూలి పనులకే పరిమితమవుతున్నారు. ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు చలనశీలతను పెంచినప్పటికీ, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు సృష్టించకపోతే, ఈ పథకాల ప్రభావం పరిమితంగానే ఉంటుంది. ఈ సందర్భంలో, ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో పరిశ్రమలు, ఉద్యోగ శిక్షణ, మహిళా సహకారాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చేయాల్సి ఉండగా ప్రభుత్వం ప్రజలను నగర ప్రయాణాలకు ఆధారపడేలా చేస్తోంది.
మధ్యతరగతి వర్గాలలో చైతన్యం
చదువుకున్న దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల మహిళలకు వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను ప్రభుత్వం సృష్టించకపోవడంతో వారే ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్లి జీవనం గడుపుతున్నారు. ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగాలు, స్వయం ఉపాధి, ఔత్సాహిక వ్యాపారాలు వంటి మార్గాలను వారు ఎంచుకుంటున్నారు. ఈ చైతన్యం సామాజిక అభివృద్ధికి ఒక సానుకూల సంకేతం. అయితే, ఈ అవకాశాలు గ్రామీణ మహిళలకు సమానంగా అందుబాటులో లేకపోవడం ఒక సవాలుగా ఉంది. ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు ఒక్కటే సరిపోవు. వీటితోపాటు ఆర్థిక స్వావలంబనను నిర్ధారించే చర్యలు కూడా అవసరం. ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి.
పురుషులపై ఆర్థిక భారం
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ఆదాయాన్ని సమతుల్యం చేయడానికి, పురుషుల బస్ ఛార్జీలను పెంచడం జరిగింది. ఈ విధానం పురుష వర్గాల నుంచి వ్యతిరేకతను రేకెత్తిస్తోంది. సామాజిక సమానత్వం ఆర్థిక న్యాయం దృష్ట్యా, ఈ విధానం సమీక్షించబడాల్సిన అవసరం ఉంది. అందరికీ సమానమైన సమర్థవంతమైన రవాణా సౌకర్యాలను అందించడం ద్వారా ఈ వివాదాన్ని తగ్గించవచ్చు. ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం లేని సమయంలో కూడా, నెలవారీ బస్ పాస్ లేదా రోజువారీ ఛార్జీల ద్వారా మహిళలు బస్సుల్లో ప్రయాణించేవారు.
ఈ వాస్తవాన్ని విస్మరించి, ఉచిత సౌకర్యం ద్వారానే మహిళలు ప్రయాణిస్తున్నారని కుట్రపూరితంగా ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య. ఇటువంటి ప్రచారం సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుంది. స్త్రీ సాధికారత అంటే పురుషులను శిక్షించడం కాదు. ఇద్దరికీ అవకాశాలు, మౌలిక సౌకర్యాలు అందించడం ద్వారా మాత్రమే సమానత్వం వస్తుంది. పౌర సమాజం ఈ విధమైన దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలి.
పౌర సమాజం బాధ్యత
స్త్రీల సాధికారత సామాజిక చైతన్యం కోసం పౌర సమాజం కీలక బాధ్యతను నిర్వర్తించాలి. స్త్రీలపై వివక్ష, హింస, మెజారిటీ సమూహాలలో అసమానతలను తొలగించడంలో సమాజం చురుకైన పాత్ర పోషించాలి. విద్య, నైపుణ్య శిక్షణ, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా స్త్రీలు తమ హక్కులను అర్థం చేసుకునేలా చేయాలి. అదే సమయంలో పురుషులు సమాజంలోని ఇతర వర్గాలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలి. ఈ ప్రక్రియ కుల, మత, జండర్ అసమానతలకు తావివ్వకుండా స్త్రీల సమతుల్య అభివృద్ధిని సాధించడానికి సహాయపడుతుంది.
మహిళల సాధికారత దిశగా..
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళల సాధికారత దిశగా ఒక ముఖ్యమైన చర్య. దాని పూర్తి సామర్థ్యాన్ని సాధించాలంటే, గ్రామీణ ఉపాధి అవకాశాల సృష్టి, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ, సామాజిక చైతన్యంపై దృష్టి సారించాలి. ప్రభుత్వం, పౌర సమాజం, వ్యక్తులు సమష్టిగా పనిచేయడం ద్వారా సమానత్వం సుస్థిర అభివృద్ధిని సాధించవచ్చు. ఉచిత ప్రయాణం లేకముందే స్త్రీలు ప్రయాణించేవారు. ఉచిత పద్ధతి వచ్చేకంటే ముందే నెలవారీ బస్సు పాస్ సౌకర్యంతో ప్రయాణాలు చేసేవారు. రోజువారీ టికెట్ ద్వారా లక్షల్లో స్త్రీలు ప్రయాణించేవారు.
అంటే వారు విద్య, ఉపాధి, మార్కెట్, కుటుంబ బాధ్యతల కోసం ఎంతోకాలంగా ప్రయాణిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి, ఉచితం కాబట్టే బస్సుల్లో ప్రయాణం పెరిగింది అని చూపించడం స్త్రీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే దుష్ప్రచారం. ఇది స్త్రీలను సమాజంలో హేళన చేయాలనే కుట్రపూరిత వైఖరి. ఉచితం అయినా కాకపోయినా. ఈ పథకం లోటుపాట్లను సవరించి కుట్రపూరిత ప్రచారాలను తిప్పికొట్టాలి. అందరికీ న్యాయం చేసేవిధంగా దీనిని అమలు చేయడం ద్వారా నిజమైన సామాజిక చైతన్యాన్ని సాధించవచ్చు.
పి. రేణుక భూంపల్లి
