హైదరాబాద్: ఐబొమ్మ పేరుతో సినిమాలను పైరసీ చేస్తున్న ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినా పైరసీ ఆగడం లేదు. ఐబొమ్మ రవినిన అరెస్టు చేసిన 24 గంటల్లో బప్పం టీవీ, ఐ బొమ్మ వెబ్ సైట్లు క్లోజ్ అయినా కొత్తగా ఐ బొమ్మ వన్ ప్రత్యక్షమైంది. సోషల్ మీడియాలో ‘అన్న మళ్లీ వచ్చాడు’ అనే ఎలివేషన్ పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ ఐబొమ్మ వన్లో ఏదైనా సినిమాను క్లిక్ చేస్తే మూవీ రూల్జ్కు రీ డైరెక్ట్ అవుతుండటం గమనార్హం. ఐ బొమ్మ వన్లోను కొత్త సినిమాలు కనిపిస్తుండటంతో సైబర్ క్రైం పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్గా మారింది.
ఐ బొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్ సైట్స్ ఉండగా అందులో ఐ బొమ్మ వన్ ఒకటి అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఐ-బొమ్మ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ చంచల్గూడ జైలు నుంచి రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఐ-బొమ్మ కేసులో రవికి ఐదు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
రవి ఐబొమ్మతో పాటు 'బప్పం' (bappam.TV) పేరు మీద 17 ప్రధాన వెబ్‌సైట్‌లు, 65కు పైగా మిర్రర్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో తేలింది. ఈ పైరసీ సామ్రాజ్యం ఎంత విస్తరించిందంటే.. ప్రతి నెలా సుమారు 3.7 మిలియన్ల యూజర్లు ఈ సైట్‌లలో లాగిన్ అవుతున్నారు.
ఈ భారీ ట్రాఫిక్‌ను ఉపయోగించుకుని.. రవి తన ఆదాయాన్ని పెంచుకోవడానికి యూజర్లను ప్రముఖ గేమింగ్ బెట్టింగ్ సైట్‌లకు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ద్వారా రవి భారీగా అక్రమ ఆదాయాన్ని సంపాదించినట్లు తేలడంతో, ఈ కేసు మనీలాండరింగ్ కోణం వైపు మళ్లింది.
