హైదరాబాద్, వెలుగు: ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమాన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) సీఈవో దివ్య దేవరాజన్‌కు మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో కొంత నెమ్మదించాయి.
ఈ అంతరాన్ని తొలగించి రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం కేవలం 18 లక్షల మంది మహిళలు మాత్రమే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
