పంచాయతీల్లో ఓటర్ల లిస్టుపై కసరత్తు షురూ

పంచాయతీల్లో ఓటర్ల లిస్టుపై కసరత్తు షురూ
  •     వార్డుల వారీగా ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం ఆదేశం 
  •     తప్పులను సరిదిద్ది రీ పబ్లిష్ చేయాలని డీపీఓలకు సూచన 
  •     రాష్ట్రంలో 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డులు

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా.. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని, గతంలో ప్రచురించిన జాబితాలోని లోపాలను వెంటనే సరిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారులను (డీపీఓ) ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్​ఉత్తర్వులు జారీ చేసింది. 

2025 జులై 1 అర్హత తేదీగా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా.. గత సెప్టెంబర్ 2న వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు.  అందులో ఓటర్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడం, మ్యాపింగ్‌‌లో తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దాలని కమిషన్ స్పష్టం చేసింది. పంచాయతీ రాజ్ చట్టం-2018  ప్రకారం.. ఓటర్ల జాబితాను పరిశీలించి, వార్డుల వారీగా ఓటర్లను రీ- అరేంజ్ చేసి మళ్లీ ప్రచురించాలని డీపీఓలను ఆదేశించింది. ఓటర్ల జాబితా సవరణ పూర్తవగానే.. ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉంది. 31 జిల్లాల్లో 12,733 గ్రామపంచాయతీలు,  1,12,288 వార్డుల్లో ఎన్నికలను  మూడు దశల్లో  నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

వార్డుల మ్యాపింగ్​లో తప్పుల సవరణ.. 

ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ, వార్డుల మ్యాపింగ్‌‌లో తప్పుల సవరణ (అడ్రస్‌‌లో మార్పు లేకుండా కేవలం వార్డు మార్పులు మాత్రమే) అవకాశం కల్పించింది. 22 వ తేదీన వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను డీపీఓలు పరిష్కరించాలి. 23వ తేదీన సవరణలు పూర్తయిన తర్వాత వార్డుల వారీగా మార్పులతో కూడిన ఫైనల్ ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించాలి. 23వ తేదీన ఓటర్ల సంఖ్యలో మార్పులకు తగ్గట్టుగా పోలింగ్ స్టేషన్ల జాబితా రీ-పబ్లికేషన్ చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డీపీఓలను కమిషన్ ఆదేశించింది.