ధోనీ కోసం ఫేర్వెల్ మ్యాచ్!

ధోనీ కోసం ఫేర్వెల్ మ్యాచ్!

నిర్వహణకు బోర్డు రెడీ
ఐపీఎల్ టైంలో మహీతో చర్చ
అతను ఒప్పుకుంటేనే జరిగే చాన్స్
ఘన సన్మానం మాత్రం పక్కా!

ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి ఇండియా బ్లూ జెర్సీలో కనిపిస్తాడా? అభిమానుల సమక్షంలో ఆఖరాట ఆడి.. సచిన్ మాదిరిగా మైదానం నుంచి ఆటకు టాటా చెబుతాడా? ఐపీఎల్ ముగిసిన తర్వాత అతని కోసం బీసీసీఐ ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేస్తుందా? అంటే ఔననే సమాధానాలు వస్తున్నాయి..! 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ప్లేయర్ గా, కెప్టెన్ గా, కీపర్ గా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి.. ఆటలో టీమిండియాను తిరుగులేని శక్తిగా మార్చిన మహేంద్రుడికి సగర్వంగా వీడ్కోలు పలకాలని బోర్డు భావిస్తోంది..! కానీ, ధోనీ ఒప్పుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది..! ఆఖరాటకు మహీ అంగీకరించకపోయినా బోర్డు అతనికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం మాత్రం పక్కా..!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇంటర్నేషనల్ కెరీర్ కు ముగింపు పలికాడు. ధోనీ ఆలోచన ఎలా ఉన్నా.. ఓ లెజెండరీ ప్లేయర్ కు అది సరైన ముగింపు కాదని పలువురు అభిప్రాయపడ్డారు. మహీకి వీడ్కోలు పలికేందుకు బీసీసీఐ ఓ ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాలని జార్ఖండ్ సీఎం సహా పలువురు క్రికెటర్లు కూడా కోరారు. ఈ ఫేర్వెల్ మ్యాచ్ విషయంలో బీసీసీఐ కూడా సుముఖంగానే ఉందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. కానీ ధోనీ ఆలోచన ప్రకారమే నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఫేర్వెల్ మ్యాచ్ జరిగినా లేకున్నా .. మహీని బోర్డు తరఫున ఘనంగా సన్మానించి వీడ్కోలు పలుకుతామని తెలిపారు. ‘ధోనీ దేశం కోసం చాలా చేసిన ప్లేయర్. అన్ని సత్కారాలకు అర్హుడు. కానీ, ప్రస్తుతం ఎలాంటి ఇంటర్నేషనల్ సిరీస్లు లేవు. ఏం జరిగినా అది ఐపీఎల్ తర్వాతే ఉంటుంది. మహీకి ఫేర్వెల్ మ్యాచ్ ఉండాలని బోర్డు కూడా కోరుకుంటోంది. కానీ ధోనీ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అందుకే ఎవరూ ఊహించని సమయంలో రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. ఫేర్వెల్ మ్యాచ్ గురించి మేము ఇప్పటిదాకా ధోనీతో డిస్కస్ చేయలేదు. కానీ ఐపీఎల్ సమయంలో కచ్చితంగా అతనితో మాట్లాడి అభిప్రాయం తెలుసుకుంటాం. ఫేర్ వెల్ మ్యాచ్ సంగతి ఎలా ఉన్నా.. బోర్డు తరఫున ధోనీని ఘనంగా సన్మానం చేస్తాం. ఆ కార్యక్రమానికి అతని అనుమతి కూడా అవసరం లేదు. సన్మానం చేయడం మా బాధ్యత’ అని ఆ అధికారి పేర్కొన్నారు.

ఇండియా మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా ధోనీకి తగిన ఫేర్వెల్ ఇవ్వాలని బోర్డును కోరాడు. ‘ధోనీ కోసం బీసీసీఐ ఓ ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహిస్తే నేను కచ్చితంగా సంతోషిస్తా. అతనో లెజెండ్. అలా ఊరికే సాగనంపడం కరెక్టు కాదు. పైగా ఫ్యాన్స్ అతన్ని మరోక్కసారి యాక్షన్లో చూడాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్లో అతని ఆట చూస్తారు. కానీ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత స్వదేశంలో ఫ్యాన్స్ మధ్య మ్యాచ్ నిర్వహించి ధోనీకి వీడ్కోలు
పలకాలి’ అని మదన్ లాల్ చెప్పుకొచ్చాడు.

For More News..

ఏడాది లీజుకు ఎలక్ట్రిక్ బైక్

హైదరాబాద్‌ లో తొలిసారిగా.. టై గ్లోబల్ సమ్మిట్ 2020

తెలంగాణలో కొత్తగా 1,724 కరోనా కేసులు