ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సుప్రీంకు చేరింది. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను పరిశీలించిన సీజేఐ దాన్ని శుక్రవారానికి లిస్ట్ చేయాలని ఆదేశించారు. 

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను ఎస్‌ఓటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నందకుమార్‌, సింహయాజులు, రామచంద్ర భారతి ఉన్నారు. షేక్‌పేటలోని హిల్‌టాప్‌ అపార్ట్‌మెంట్‌ నుంచి వీరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు..  సైబరాబాద్‌ సీపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యూడీషియల్ రిమాండ్కు పంపారు.

ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు నిందితులను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. వారి రిమాండ్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల పిటిషన్ ను విచారించిన హైకోర్టు ముగ్గురు నిందితుల రిమాండ్కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.