పానుగల్,వెలుగు: ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికలలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయలేదని కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యాన్ని కొనడంలేదని పానుగల్ మండల పరిధిలోని శాగాపూర్ గ్రామానికి చెందిన తెలుగు మద్దిలేటి తెలిపారు. 20 రోజులుగా కొనుగోలు కేంద్ర వద్దనే ధాన్యాన్ని ఉంచానని, రెండు రోజుల క్రితం పక్క గ్రామమైన శాగాపూర్ తాండకు ధాన్యాన్ని సొంత ఖర్చులతో తరలించానని, అక్కడ కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికార పార్టీ నాయకులు నిర్వాహకులను బెదిరించారని అన్నారు.
విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ సుబ్బయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతయ్య, సుధాకర్ యాదవ్,బాలస్వామి, నాగేంద్రం తదితరులు కేంద్రం వద్దకు వచ్చి రైతుకు మద్దతుగా నిలిచారు.ధాన్యాన్ని తూకం చేసే వరకు అక్కడే ఉండి తూకాన్ని మొదలు పెట్టించారు. అనంతరం డీపీఎం, ఏపీఎం లు కేంద్రం దగ్గరకు వచ్చి తేమ సరిగా లేదని తూకాన్ని మధ్యలోనే నిలిపివేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
