
హైదరాబాద్, వెలుగు: రైతులకు పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌లో ఈ స్కీమ్ ప్రకటించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఎక్సర్‌సైజ్ మొదలు పెట్టింది. కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత పలు కారణాలతో ఆ హామీ అలాగే ఉండిపోయింది. కాగా రైతుబంధు, రైతుబీమా పథకాలకు తోడు అన్నదాతల కోసం మరో స్కీం తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రభుత్వవర్గాలు పలు సందర్భాల్లో వెల్లడించాయి. ఈ క్రమంలోనే రైతుల కోసం పింఛన్ స్కీం తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైతు పింఛన్ విధివిధానాలు ఖరారు చేసే పనిలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నిమగ్నమైంది. 47 ఏండ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు రూ.2,016 పింఛన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు పింఛన్ ఇస్తున్నారు. గీత కార్మికులకన్నా రైతుల వయోపరిమితి రెండేండ్లు తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రైతుబంధు పొందుతున్న రైతులు 67 లక్షల పైచిలుకు ఉన్నారు. వీరిలో 47 ఏళ్లు నిండిన వాళ్లు ఎంత మంది ఉన్నారు? 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తీస్తున్నారు. వారిలో ఎంత మందికి ఎంత భూమి ఉందనే వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మూడెకరాల నుంచి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పింఛన్ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. బడ్జెట్ రూపొందించే నాటికి ఈ పింఛన్ పథకం సమగ్ర స్వరూపాన్ని సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా స్కీం ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈక్రమంలోనే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ రైతులకు పింఛన్‌లు ఇవ్వడం ద్వారా ఖజానాపై ఎంత భారం పడుతుందనే వివరాలతో కూడిన నివేదిక సిద్ధం చేస్తోంది.