మంత్రి కొప్పులకు నిరసన సెగ

మంత్రి కొప్పులకు నిరసన సెగ

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు రైతుల నిరసన సెగ తగిలింది. జూన్ 3వ తేదీ శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలపూర్ గ్రామానికి చెందిన సట్టం శెట్టి రాజన్న అనే రైతు ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధాన్యం పోసి నిరసన తెలిపాడు. 45 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. బస్తాకు నాలుగు కిలోలు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. క్యాంప్ ఆఫీసులో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉండగానే ట్రాక్టర్ లో ధాన్యం తీసుకువచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు పోశాడు రైతు రాజన్న.  స్వయంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనుగోలు కేంద్రానికి వచ్చి తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని.. అయినా కూడా కొనుగోళ్లు చేయడం లేదని ఆ రైతు మండిపడ్డాడు.

ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే మిల్లర్లు దోచుకుంటున్నారని రైతు రాజన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే రెండుసార్లు అకాల వర్షాలు వచ్చి ధాన్యం తడిసి పోయిందని.. రైతుల బాధలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిరసన తెలపడం జరిగిందని చెప్పాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్యాంప్ ఆఫీసు ముందు నుండి ధాన్యాని తీసివేసి.. ట్రాక్టర్ లో పోలీస్ స్టేషన్ కు తరలించారు.