రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి

రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి

రైతు వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నట్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు 3 వేల భృతి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు. ఇంతవరకు రైతులకు ఉచిత ఎరువులు ఇవ్వడం లేదని, రైతు ఋణమాఫీ లేదన్నారు. 2022, మే 31వ తేదీ మంగళవారం కరీంనగర్ లోని తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో జరిగిన రైతు రచ్చబండ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అకార వర్షాలు, తదితర కారణాల వల్ల పంటలు నాశనమయ్యాయని, వారికి పంట నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనబరుస్తోందని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తానని చెప్పి పేద ప్రజలను మోసం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని వెల్లడించారు.


గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తీసుకొచ్చి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చేశామని గుర్తు చేశారు. 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చిందని, ఉపాధి హామీ పథకం తెచ్చింది కాంగ్రెసేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే.. భూ దందాలను అరికడుతామని, రూ.2 లక్షల రైతు రుణమాఫీ..ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తామన్నారు.  ఇందిరమ్మ రైతు భరోసా కౌలు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వడం జరుగుతుందని హామీనిచ్చారు. ఉపాధి హామిలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పొన్నం వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తల కోసం :-

సివిల్స్ ర్యాంకర్లకు కేటీఆర్ విషెస్


మరోసారి భూముల వేలానికి నోటిఫికేషన్