- 11 అంకెల యూనిక్ ఐడీ ఉంటేనే కేంద్ర పథకాలకు అర్హులంటున్న ఆఫీసర్లు
- 79.54 శాతంతో పెద్దపల్లి ఫస్ట్, 46.37 శాతంతో మేడ్చల్ లాస్ట్
- రిజిస్ట్రేషన్‌కు మరో నెల రోజులే గడువు
యాదాద్రి,వెలుగు: ఆధార్ మాదిరిగానే ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య (ఫార్మర్ యూనిక్ ఐడీ) కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఫార్మర్ రిజిస్ట్రీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యూనిక్ ఐడీ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు అందనున్నాయి. కానీ రిజిస్ట్రేషన్‌పై ఆసక్తి లేక కొందరు, అవగాహన లేక మరికొందరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం లేదు. దీంతో అన్ని జిల్లాల్లో యావరేజ్‌గా 65 శాతమే రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.
యూనిక్ ఐడీ ఉంటేనే కేంద్ర పథకాలు
వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీని అమలు చేస్తోంది. గతేడాది వానాకాలం సీజన్ నుంచి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిజిస్టేషన్ విషయంలో మొదట్లో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మీ - సేవలో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించారు. భూమి ఉన్న ప్రతి రైతుకు తన భూయాజమాన్య వివరాలతో ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా 11 అంకెల ఫార్మర్ ఐడీని కేటాయిస్తున్నారు.
ఈ ఐడీ నంబర్ ఉంటేనే 2026- – -27 నుంచి వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, యంత్ర పరికరాల సబ్సిడీ, కిసాన్ క్రెడిట్ కార్డు, విత్తన సబ్సిడీ, పంట నష్టపరిహారం, పంటల బీమా వంటి ప్రయోజనాలు అందనున్నాయి. భవిష్యత్‌లో ఇతర రైతు సంక్షేమ, అగ్రికల్చర్ స్కీమ్స్‌తో పాటు ఎరువులు, పంట క్రయ విక్రయాల విషయంలోనూ ఈ యూనిక్ ఐడీని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.
పెద్దపల్లి ఫస్ట్.. మేడ్చల్ లాస్ట్
రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 73,82,286 పాస్ బుక్స్ ఉండగా.. ఇందులో 48,97,187 (66.34 శాతం) మంది రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్‌లో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్‌లో నిలువగా.. మేడ్చల్ లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 155,413 పాస్‌బుక్స్ ఉండగా.. ఇందులో 123,612 (79.54) మంది రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 339,832 పాస్‌బుక్స్ ఉండగా.. 264,717 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో 77.90 శాతంతో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
తర్వాతి స్థానాల్లో వరుసగా సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, జనగామ, సిరిసిల్ల జిల్లాలు నిలిచాయి. రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మేడ్చల్ జిల్లా 46.37 శాతం చివరి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 46,913 మంది రైతులు ఉండగా 21,754 (46.37 శాతం) మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా 51.60 శాతం 31వ స్థానంలో నిలిచింది. సూర్యాపేట 11వ స్థానంలో నిలువగా.. యాదాద్రి 24, నల్గొండ జిల్లా 29వ స్థానంలో నిలిచింది.
ఆసక్తి లేక కొందరు.. అవగాహన లేక మరికొందరు
రూల్స్ ప్రకారం ఐటీ చెల్లించే వారికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వర్తించవు. దీంతో తమ పేరున వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ ఇన్‌కం ట్యాక్స్ చెల్లించే ఉద్యోగులు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు ఆసక్తి చూపడం లేదు. మరో వైపు చిన్న, సన్నకారు రైతులకు ఈ రిజిస్ట్రేషన్‌పై అవగాహన లేకపోవడంతో అటు వైపు వెళ్లడం లేదు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు మరో నెల మాత్రమే గడువు ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 66 శాతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రమే పూర్తి కాగా.. మొత్తం 100 శాతం పూర్తి కావడానికి మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
రైతులంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వర్తించాలంటే ఈ యూనిక్ ఐడీ తప్పనిసరి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు భవిష్యత్‌లో స్కీమ్స్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.– వెంకట రమణారెడ్డి, డీఏవో, యాదాద్రి

