పరిశ్రమల కోసం... పచ్చని భూములు

పరిశ్రమల కోసం... పచ్చని భూములు

నల్గొండ, వెలుగు : మిర్యాలగూడ మండలం ఆళ్లగడపలో సెజ్​ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై రైతులు మండిపడ్తున్నారు. మిల్లర్లు, పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసం రైతుల నుంచి పంట భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ రైతులు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు భూములు సేకరించాలని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదు పాయాల కల్పన సంస్థ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం సేకరించిన ఫారెస్ట్ ల్యాండ్​ను వాడుకోవాలని,  మిర్యాలగూడ మండలం ఆళ్లగడపలో  రైతుల నుంచి పట్టా భూములు సేకరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ కోసం సేకరించిన నాలుగువేల ఎకరాల్లో ప్లాంటు అవసరాలకు పోగా దాదాపు పన్నెండొందల ఎకరాలు ఖాళీగానే ఉంది. ఈ భూముల్లో సెజ్ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, పవర్ ప్లాంట్ కోసం సేకరించిన భూమిని ఇతర అవసరాల కోసం తీసుకోవాలంటే కేంద్ర అటవీశాఖ పర్మిషన్​ కావాలి. ఫారెస్ట్​ క్లియరెన్స్​ రావాలంటే చాలా టైం పడుతుందని భావించి ఆళ్లగడప భూములు తీసుకోవాలని  అధికారులు స్కెచ్ వేశారు. ఈ గ్రామంలో సర్కారు భూమి వంద ఎకరాలు మాత్రమే ఉంది. ఆ భూములు మీద కూడా రెవిన్యూ, ఫారెస్ట్ డిపార్టమెంట్ల నడుమ పంచాయితీ నడుస్తోంది. అయినా ఇక్కడ ఫిన్లాండ్​కంపెనీ ఏర్పాటు చేయబోయే ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇందులోంచి 50 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే ప్రాంతంలో మిల్లర్లకు అవసరమయ్యే సెజ్ ఏర్పాటు కోసం 500 ఎకరాలు  సేకరించాలని నిర్ణయించారు. ఆళ్లగడపలో భూసేకరణ కోసం పట్టాదారుల పేర్లతో ఈ నెల 4 న  నోటిఫికేషన్ ఇచ్చారు. పంచాయతీ ఆఫీసులో ఈ నోటీసును   అతికించారు. తమ భూములు పోతున్నాయని తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఆళ్లగడప గ్రామ పంచాయతీ ఆఫీసు లో సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో  సమావేశమై సెజ్​కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు.  
మిల్లర్లకే  పెద్దపీట...
మిర్యాలగూడెం పూర్తిగా నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఉండడంతో ఇక్కడ భూములకు డిమాండ్ ఎక్కువ.  మిర్యాలగూడ మీదుగా నార్కట్​పల్లి, అద్దంకి హైవే పోతోంది. రైస్​ ఇండస్ట్రీస్​కు ప్రపంచంలోనే ఈ ప్రాంతం ప్రసిద్ది. ఇక్కడనుంచి చాలా దేశాలకు రైస్​ ఎక్స్​పోర్ట్​జరుగుతుంది. దీంతో ఇండస్ట్రీని మరింత విస్తరించాలని  మిల్లర్లు  భావిస్తున్నారు.  రైస్ మిల్లులతో పాటు పాడీ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు 300 మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. దాంతో సెజ్​కోసం  భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టారు. 
ఆళ్లగడప రైతుల పొట్టకొట్టేందుకే...
సెజ్ ఏర్పాటుకు టీఎస్ఐఐసీ దామరచర్ల, ఆళ్లగడప రెండు చోట్ల లాండ్స్ గుర్తించింది. రెండు, మూడు దఫాలుగా లాండ్ సర్వే చేశారు. జిల్లా లెవల్ లో మీటింగ్ పెట్టారు. థర్మల్ పవర్ ప్లాంట్​భూములను తీసుకునే వీలు లేకపోవడంతో ఆళ్లగడపలో భూములు సేకరిస్తున్నారు. మిల్లర్ల ప్రయోజనాల కోసం  తమ పొట్టకొట్టడం కరెక్ట్ కాదని ఆళ్లగడప రైతులు అంటున్నారు. ఆళ్లగడపలో ప్రస్తుతం భూముల విలువ ఎకరానికి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఉందని, అందుకే మిల్లర్లు, నేతలు తమ భూములమీద కన్నేశారని వారు ఆరోపిస్తున్నారు. సెజ్ వస్తుందన్న ఆలోచనతో ఇక్కడ రియల్టర్లు ముందుగానే తక్కువ ధరలకు భూములు కొనిపెట్టుకున్నారు.  ఇదేం తెలవని చిన్న సన్నకారు రైతులు ఆయోమయంలో పడ్డారు. తమ భూములు సర్కారు తీసుకుంటే ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. విలువైన తమ భూములను సర్కారు ధరలకు ఎట్లా ఇస్తామని అంటున్నారు. తమ భూములు వదిలిపెట్టాలని కోరుతున్నారు.


భూమి తీసుకుంటే ఎట్ల బతకాలే 
నాకు గ్రామంలోని 515, 506  సర్వే నెంబర్లలో ఆరు ఎకరాల భూమి ఉంది. ఐదేళ్లుగా బత్తాయి తోట పెడుతున్నా. ఇప్పుడు  పంట చేతికివచ్చినంక భూమి సేకరిస్తున్నమని నోటీసులు ఇచ్చారు. మా పట్టా భూములు తీసుకుంటే కుటుంబాన్ని ఎట్లా పోషించాలే. భూమి తీసుకుని నా కుటుంబాన్ని రోడ్డున వేయొద్ధు.                                                                                                                                                       - కుర్ర నాగరాజు, ఆలగడప 

హైవే వెంట ఉన్న భూమిని ఎట్ల ఇయ్యాలే
నాకు 605, 606లో మిర్యాలగూడ, కోదాడ హైవే పక్కనే రెండు ఎకరాల పట్టా భూమి ఉంది.  ఎకరం కోటిపైగా పలుకుతుంది. పట్టణానికి దగ్గరగా  ఉన్న  విలువైన భూమిని సెజ్​కోసం సేకరిస్తామని నోటీస్ ఇవ్వటం ఎంత వరకు కరెక్ట్. రైతులకు అన్యాయం చేసి పారిశ్రామిక వేత్తలకు లాభం చేయటం సరికాదు. 
                                                                                                                                                                - మట్టపల్లి రాంచంద్రయ్య, ఆలగడప