- పేరుకే జెండా పాట రేటు
- క్వింటాకు రూ. 6000 దాటడం లేదు
- మార్చి 1నుంచి సీసీఐ కొనుగోలు కేంద్రాల మూతతో దుస్థితి
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ పత్తి కొనుగోల్లు నిలిపివేయడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. రెండవ విడత ఏరుతున్న పత్తిలో గులాబీ రంగు పురుగు కారణంగా ఇంట్లో నిల్వ చేయలేక మిల్లర్ చెప్పిన రేటుకు అగ్గువకే అమ్ముకుంటున్నారు. వరంగల్ మార్కెట్ యార్డులో జెండా పాట రేటు ఖరారు కాగానే కొనుగోళ్లు చేపడుతున్నారు.
జెండా పాటగా రూ.7200 ఖరారు అయితే అందుకు భిన్నంగా గ్రామాల్లో ప్రయివేట్ వ్యాపారులు, మిల్లర్లు నాణ్యత పేరిట రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. పత్తిలో చెత్త, నాణ్యత సాకుతో మిల్లర్లు రూ. 6000 కు కొనుగోళ్లు చేపడుతుండటంతో తప్పని పరిస్థితుల్లో రైతులు అమ్ముకొవాల్సిన పరిస్థితి నెలకొంది.
సీసీఐ 29.48లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ ఏడాది 29,48,473 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరి తర్వాత పత్తి అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 98వేల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా 12లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. దీంతో జిల్లాలో కాటారం మార్కెట్ పరిధిలో రెండు సీసీఐ కొనుగోలు కేంద్రాలు, భూపాలపల్లి ఒకటి, చిట్యాల మార్కెట్ పరిధిలో 2 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు చేపట్టారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాది 4.25లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేయగా ఈ ఏడాది 2.87లక్షల క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది. గత సీజన్‌తో పోల్చితే 1.38లక్షల క్వింటాళ్లు తగ్గింది. అలాగే ఈ ఏడాది జిల్లాలో ప్రయివేట్ వ్యాపారులు సైతం 17,896 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మార్చి 1నుంచి సీసీఐ కేంద్రాల మూతతో రైతులు పత్తిని అమ్మేందుకు ప్రయివేట్ వ్యాపారులు, జన్నింగ్ మిల్లుల బాట పడుతున్నారు.
తక్కువకే అమ్ముకుంటున్నరు.
రెండవ విడత పత్తి ఏరే సమయంలో సీసీఐ కేంద్రాలు మూతపడటంతో పత్తి రైతులకు జిన్నింగ్ మిల్లులు, ప్రయివేట్ వ్యాపారులే దిక్కయ్యారు. కూలీల కొరతతో పత్తితీత అలస్యంలో కావడంతో కొనుగోలు చేసే మిల్లర్లు పత్తిలో నాణ్యత లేదని బీ, సీ కేటగిరి నిర్ణయించి కొనుగోళ్లు చేపడుతున్నారు.
వరంగల్ మార్కెట్ యార్డులో ఖరారు అయ్యే జెండా పాటతో సంబంధం లేకుండా సీ కేటగిరి పత్తిని రూ. 5000 నుంచి కొనుగోలు చేస్తుండగా బీ కేటగిరి పత్తిని రూ. 6000కు మించి ధర పెట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేది ఏమి లేక తక్కువైనా.. మిల్లర్ చెప్పిన రేటుకే అమ్ముకుంటున్నారు. రెండవ విడతలో ఒక్కో రైతుకు అధికంగా పత్తి దిగుబడి వస్తున్నా గులాబీ రంగు పురుగుతో ఇంట్లో నిల్వ చేస్తే ఇంటిల్లిపాదికి దురదతో చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో పత్తి నిల్వ చేయలేక మిల్లర్లకు అమ్ముకుంటున్నారు.
ఈ ఏడాది విక్రయాలు తగ్గాయి
ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడి భారీగా తగ్గింది. విక్రయాలు సైతం అదే స్థాయిలో తగ్గాయి. గతేడాది సీసీఐ ద్వారా 4.25లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా ఈ ఏడాది 2.87లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశాం. రెండవ విడత పత్తిలో పుచ్చు కారణంగా క్వాలీటీ లేదు. మార్చి 1నుంచి సీసీఐ కొనుగోళ్లు సెంటర్లు మూసివేయడం జరిగింది.
- మహమ్మద్ లాస్ షరీఫ్, భూపాలపల్లి మార్కెట్ సెక్రటరి
