రుణమాఫీ.. పైసలు ఎప్పుడో

రుణమాఫీ.. పైసలు ఎప్పుడో
  •                ఇప్పటికీ బ్యాంకులకు అందని గైడ్‌‌‌‌‌‌‌‌ లైన్స్‌‌‌‌‌‌‌‌
  •                 48 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల బకాయిలు
  •                 గత బడ్జెట్​లో 6 వేల కోట్లు
  •                 ఇప్పటి వరకు పైసా విదల్చని ప్రభుత్వం
  •                 కొత్త రుణాలు అందక రైతుల ఇబ్బందులు
  •                 బడ్జెట్​సమావేశాల వరకూ ఆగాల్సిందేనా

పంట రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతను ఇవ్వకపోవడంతో కొత్త రుణాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.  అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ. లక్ష వరకు రుణ మాఫీ చేస్తామని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చారు. ఓటాన్ అకౌంట్​బడ్జెట్​సమావేశాల్లో సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. డిసెంబర్​11, 2018 ని రుణమాఫీకి కటాఫ్​ డేట్​గా ప్రకటించారు. అప్పటివరకు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ఆ తర్వాత ఆరు నెలలకు మరో ప్రకటనలో ఆగస్టు 15న రైతు రుణమాఫీకి ఆదేశాలిచ్చినట్లు టీఆర్​ఎస్​ ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇప్పటికీ రుణమాఫీకి సంబంధించిన గైడ్​లైన్స్​రూపొందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఈ పథకంకోసం రూ.6 వేల కోట్లు కేటాయించినా.. ఇప్పటి వరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. రుణం మాఫీ అవుతుందనే ఆశతో దాదాపు 70 శాతం మంది రైతులు రుణాలు రెన్యూవల్‌‌‌‌‌‌‌‌ చేసుకోలేదు. దీంతో కొత్తగా రుణాలిచ్చేందుకు బ్యాంకులు నిరాకరించడం, ఫలితంగా పంట రుణం, పంటల బీమా, వాతావరణ ఆధారిత బీమాకు రైతులు దూరమవుతున్నారు.

31 వేల కోట్ల బకాయిలు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42.36 లక్షల మంది రైతులు తీసుకున్న రుణాలు రూ.32,262 కోట్లు.. మరో 5.78 లక్షల మంది బంగారం తాకట్టుపెట్టి రూ.5 వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నారు. అయితే, రూ.లక్ష వరకే మాఫీ చేస్తామని ప్రభుత్వం పరిమితి విధించడంతో.. ప్రాథమికంగా రుణమాఫీ బకాయిలు రూ.31,824 కోట్ల దాకా ఉంటాయని అంచనా. 2014లో 35.29 లక్షల మంది రైతులకు రూ.16,124 కోట్ల రుణాన్ని ప్రభుత్వం విడతలవారీగా మాఫీ చేసింది.

గైడ్​లైన్స్​ ఏవి?

రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. కుటుంబంలో ఎంతమందికి రుణమాఫీ వర్తిస్తుంది.. బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకుంటే మాఫీ ఇవ్వాలా? వద్దా? అనే విషయాలపై స్పష్టత లేదు. కుటుంబంలో అందరికీ కలిపి లక్ష రూపాయలా, ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయల అనేది చెప్పలేదు. నగలు కుదువ పెట్టి తీసుకున్న రుణాలు, ఎంతవరకు మాఫీ చేస్తారనేదీ చెప్పలేదు. దీంతో స్టేట్‌‌‌‌‌‌‌‌ లేవల్‌‌‌‌‌‌‌‌ బ్యాంకర్స్‌‌‌‌‌‌‌‌ కమిటీ ఇప్పటివరకు బ్యాంకుల వారీగా రైతు రుణాల వివరాలు సేకరించలేదు. నిధులు సర్దుబాటు కాకపోవడంవల్లే ఇన్నాళ్లు రుణమాఫీపై ప్రభుత్వం దృష్టి సారించలేదని తెలుస్తోంది. రాబోయే బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సమావేశాల్లో దీనిపై స్పష్టమైన ప్రకటనచేసే అవకాశం ఉందని, విడతలవారీగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.