సీజన్ దగ్గర పడుతున్నావిత్తనాలేవీ?

సీజన్ దగ్గర పడుతున్నావిత్తనాలేవీ?

హైదరాబాద్​, వెలుగువానాకాలం దాదాపు వచ్చేసింది. వర్షాలు పడుతుండడంతో రైతులూ పంట చేలను రెడీ చేసుకుంటున్నారు. కానీ, పంటకు అవసరమైన విత్తనాలు జిల్లాలకు  కొద్ది మొత్తంలోనే చేరాయి. సీజన్​ దగ్గరపడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది షరతుల సాగు విధానంలో పంటలు వేసేందుకు రాష్ట్ర సర్కారు పంటల ప్లాన్​ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం రైతులకు విత్తనాలు సరఫరా చేయనుంది సర్కార్​. ఈ ఏడాది 4.55 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేసింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, హాకా, జాతీయ విత్తన సంస్థల నుంచి విత్తనాలను రైతులకు అందించాలని నిర్ణయించింది. కానీ, ఇప్పటిదాకా జిల్లాలకు చేరింది కేవలం 61,854 క్వింటాళ్లే. వాటిలో 31,682 క్వింటాళ్ల విత్తనాలు అమ్ముడుపోయాయని అధికారులు చెబుతున్నారు. పోయినేడాది 2.99 లక్షల క్వింటాళ్ల విత్తనాలనే సర్కార్​ సరఫరా చేయగా, ఈ ఏడాది అదనంగా మరో 1.56 లక్షల క్వింటాళ్లను ఇవ్వనుంది. ఈ ఏడాది కోటి 30 లక్షల నుంచి కోటి 35 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. పోయినేడాది సాగైన భూమి కేవలం కోటి 22 లక్షల ఎకరాలే.

పత్తి విత్తనాల బాధ్యత ప్రవేటుకే..

పంట ప్రణాళికల ప్రకారం పత్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది సర్కార్​. 60.33 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయించాలని నిర్ణయించింది.అయితే, పత్తి విత్తనాల సరఫరా బాధ్యతను ప్రైవేట్​ కంపెనీలకు ఇచ్చింది.

కంది అసలు రానే రాలే

ఈ ఏడాది సాగును 12.51 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టు 16,452 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు ఇవ్వాలని సర్కార్​ ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ, ఇప్పటిదాకా ఆ విత్తనాలను సరఫరా చేయనే లేదు. ఈ ఏడాది సోయాబీన్​తో పాటు పచ్చిరొట్ట ఎరువుగా వాడే పిల్లి పెసర, సన్​హెంప్​, దయించా విత్తనాలను మాత్రమే సబ్సిడీతో అమ్ముతోంది సర్కార్​. వాటిలో ఇప్పటిదాకా 59,878 క్వింటాళ్లు మాత్రమే జిల్లాలకు చేరాయి. 31 వేల క్వింటాళ్లు అమ్ముడుపోయాయి. సోయాకు 1.45 లక్షల క్వింటాళ్లకు ప్రణాళికలు వేయగా, కేవలం 1,636 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. పోయినేడాది అన్ని విత్తనాలు కలిపి 2.99 లక్షల క్వింటాళ్లను సర్కార్​ సరఫరా చేసింది. 76.76 కోట్ల రూపాయల సబ్సిడీని భరించింది.

సన్న వడ్లు వచ్చింది 339 క్వింటాళ్లే

వడ్లలో సన్నరకాలనే వ్యవసాయశాఖ రైతులకు అందిస్తోంది. తెలంగాణ సోనా (ఆర్​ఎన్​ఆర్​15048), సాంబమసూరి(బీపీటీ5204) విత్తనాలనే అందుబాటులో ఉంచారు. నిరుడు ఈ రెండు రకాల విత్తనాలను 58,500 క్వింటాళ్లు రైతులకు సరఫరా చేశారు. ఈ ఏడాది 1.38 లక్షల క్వింటాళ్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, ఇప్పటి వరకు కేవలం 339 క్వింటాళ్లే జిల్లాలకు చేరాయి. 25 క్వింటాళ్లలోపే రైతులు కొనుగోలు చేశారు. అంటే రైతులకు చేరింది దాదాపు 0.5 శాతం విత్తనాలే. నేషనల్​ సీడ్​ కార్పొరేషన్​ నుంచి 9,000 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించాలని ప్లాన్​ చేసినా, ఇప్పటిదాకా అందలేదు. దీంతో రైతులు ప్రైవేట్​ కంపెనీల విత్తనాలవైపు చూస్తున్నారు.

ఇదీ విత్తన అమ్మకాల తీరు (క్వింటాళ్లలో)

విత్తనాలు           2020 ప్రణాళిక          జిల్లాలకు చేరింది               2019 లో అమ్మింది

వడ్లు                   1,38,148                    339                        58,553.5

కంది                   16,452                        0                            2,637

సోయ                 1,45,000                 1,636.8                     1,44,916.8

పచ్చిరొట్ట            1,55,464               59,878.30                  93,388

మొత్తం              4,55,064                   61,854.1                  2,99,496.46