ఫసల్ బీమా అమలు చేయడం లేదు: రైతు స్వరాజ్య వేదిక

ఫసల్ బీమా అమలు చేయడం లేదు: రైతు స్వరాజ్య వేదిక

ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన రైతన్నలకు మద్దతుగా ఉద్యమానికి సిద్దమైతున్నాయి రైతు సంఘాలు. మూడేళ్లుగా పంటనష్టంపై తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహారిస్తున్న రాష్ట్ర సర్కార్ పై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డాయి. అందులో భాగంగానే పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అన్ని జిల్లాల నుంచి ఈనెలాఖరులోపు పదివేల పోస్టుకార్డులను ప్రగతిభవన్ కు పంపే పనిలో పడ్డారు రైతు స్వరాజ్య వేదిక నేతలు.

పోస్ట్ కార్డ్ ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది రైతు స్వరాజ్య వేదిక. మూడేళ్లుగా ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఈనెలాఖరులోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులతో ఉత్తరాలు రాయించి ప్రగతిభవన్ కు లేఖలు పంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫసల్ భీమా అమలు చేయకపోవడం.. పంటనష్టం పరిహారం ఇవ్వకపోవడంపై పోస్ట్ కార్డు ద్వారా నిరసన తెలిపేందుకు రెడీ అయ్యారు. 

ప్రభుత్వం లెక్కల ప్రకారం 2020లోనే ప్రకృతి వైఫరిత్యాలతో 15 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అంచనా వేసింది. పరిహారం ఇచ్చేందుకు దాదాపు 6 వందల కోట్లు కావాలని కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఇక 2021, 2022లో అయితే పంటనష్టానికి సంబంధించిన కనీసం లెక్కలు కూడా వేయలేదు. దీంతో మూడేళ్లుగా పరిహారం పొందలేకపోతున్నారు రైతులు. చేసేదేం లేక రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 మార్చి వరకు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు. ప్రధానంగా 2020కి సంబందించి పంటనష్ట పరిహరం విషయంలో హైకోర్టు ఆదేశాలను పాటించాలని, 2021, 22 సంవత్సరంలో జరిగిన పంటనష్టానికి సంబందించిన లెక్కలు తీయాలనేది ప్రధాన డిమాండ్. కేంద్రప్రభుత్వం తెచ్చిన ఫసల్ భీమా పథకం నుంచి రాష్ట్ర సర్కార్ బయటికి వచ్చిందని.. రాష్ట్ర పరిధిలో ప్రత్యేక పంటల భీమా పథకం అమలు చేయాలంటున్నారు రైతుసంఘాల నేతలు. పోస్ట్ కార్డు ఉద్యమంలో రైతులతో పాటు విద్యావేత్తలు, పార్టీలకతీతంగా ఎవరైనా స్పందించవచ్చంటున్నారు రైతుస్వరాజ్య వేదిక ప్రతినిధులు. పోస్ట్ కార్డు ఉద్యమం తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు.